వేతనాలు అందక వెతలు | no salaries for contract Medical health department workers | Sakshi
Sakshi News home page

వేతనాలు అందక వెతలు

Published Wed, Jul 27 2016 3:04 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

వేతనాలు అందక వెతలు - Sakshi

వేతనాలు అందక వెతలు

కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల ఆవేదన
ప్రభుత్వం నిధులు విడుదల చేసినా..
జీతాలు ఇవ్వని అధికారులు..

మోర్తాడ్ :  దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేడు అన్న చందంగా తయారైంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఆంశం పరిశీలనలో ఉండగా 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల కాంట్రాక్టును పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వేతనాలకు సంబంధించిన కొంత గ్రాంటును విడుదల చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం వేతనాలు నెలల తరబడి అందకపోవడంతో అవస్థలపాలవుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల చెల్లింపులకు సంబంధించి ఉన్నతాధికారి సుముఖంగా ఉన్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని కొందరు ఉద్యోగుల వైఫల్యం కారణంగానే వేతనాలు అందడం లేదని తెలుస్తోంది.

జిల్లాలోని వివిధ సబ్ సెంటర్‌ల పరిధిలో 77 మంది యంపీహెచ్‌ఏ(మేల్‌వర్కర్), తొమ్మిది మంది ఫార్మసిస్టులు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్‌లు, 11 మంది ఓపీ ఏఎన్‌ఎంలు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. వీరితో పాటు 369 మంది రెండో ఏఎన్‌ఎంలు, 58 మంది యూరోపియన్ పథకం కింద ఎంపికైన ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు.  వీరి వేతనాల కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.1.16 కోట్ల గ్రాంటును విడుదల చేసింది. ప్రతి నెలా వేతనాల చెల్లింపుల కోసం ఉద్యోగులతో బ్యాంకు ఖాతాలను తెరిపించింది.

గడచిన మార్చితో కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు పూర్తి కావడంతో మళ్లీ ఏప్రిల్ నుంచి కాంట్రాక్టును పొడగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రాక్టు ఒప్పందం బాండ్‌ను అందచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల కాల పరిమితి 2017 మార్చి 31వరకు పొడిగించారు. ప్రతినెలా వేతనాలను చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలు అవుతున్నా ఉద్యోగులకు మాత్రం వేతనాలు అందడం లేదు.దీంతో ఉద్యోగులు ఇంటి అద్దె, పిల్లల చదువు, కుటుంబ పోషణ తదితర భారాలను మోస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

దయనీయ స్థితిలోయూరోపియన్ ఏఎన్‌ఎంలు
జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో యూరోపియన్ పథకం కింద పని చేస్తున్న ఏఎన్‌ఎంల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వీరికి  11 నెలల నుంచి వేతనం అందడం లేదు. వారు ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో ఇటీవల మూడు నెలల వేతనం అధికారులు మంజూరు చేశారు. జిల్లాలో యూరోపియన్ పథకం కింద పని చేస్తున్న ఏఎన్‌ఎంలు 58 మంది ఉన్నారు.

బాండ్స్ అందకపోవడంతోనే ఆలస్యం
కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు బాండ్ అందకపోవడం వల్లనే వేతనాల చెల్లింపులో ఆలస్యం అవుతుంది. జిల్లాలోని సాలూర పీహెచ్‌సీ నుంచి ఆరుగురు ఉద్యోగుల కాంట్రాక్టు బాండ్ అందాల్సి ఉంది. వారి నుంచి స్పందన లేదు. అందువల్లనే ఇతర ఉద్యోగులకు ఇబ్బంది ఏర్పడింది. - డాక్టర్ వెంకట్, జిల్లా వైద్య ఆర్యోగ శాఖ అధికారి

సమ్మె నోటీసు ఇస్తున్నాం
కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాల గ్రాంటను విడుదల చేసినా జిల్లా అధికారులు వేతనాలు చెల్లించక పోవడం వల్ల ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడో లోపం జరిగిందని అందరు ఉద్యోగులకు వేతనాలు చెల్లించ కుండా నిలపివేయడం సరైంది కాదు. సమ్మె నోటీసును అందచేస్తున్నాం. - అశోక్, పారామెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోషియేషన్ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement