వారికి పెద్ద పీట.. వీరిపై చిన్నచూపు
-
కార్పొరేషన్ కార్మికులకు రెండు నెలలుగా అందని జీతాలు
-
కాంట్రాక్టర్‌లకు రూ.కోటి బిల్లుల మంజూరు
-
కమీషన్ల కోసం అధికారులు, అధికార పార్టీ నాయకుల తాపత్రేయం
పగలు, రాత్రి తేడా లేకుండా కష్టం చేసే కార్మికులు పట్ల అధికార పార్టీ నాయకులు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలో కాంట్రాక్టర్‌ల వద్ద నుంచి కమీషన్‌ల కోసం రూ.కోట్లు బిల్లులపై సంతకాలు చకచక జరిగిపోతున్నాయి. కార్మికుల జీతాలు మాత్రం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రెండు నెలల నుంచి జీతాలు తమ ఖాతాల్లో పడకపోవడంతో అప్పులుపాలవుతున్నారు.
నెల్లూరు,సిటీ : నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని హెల్త్ విభాగంలో 877 మంది సొసైటీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి జూలై, ఆగస్టు నెలల జీతాలు చెల్లింపులు జరగలేదు. సుమారు రూ.1.93 కోట్లు వరకు రెండు నెలల జీతాలు కార్మికుల ఖాతాల్లో పడాల్సి ఉంది. అయితే మేయర్ అజీజ్, కమిషనర్ కె.వెంకటేశ్వర్లు కార్మికులు జీతాలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కార్మికులకు అండగా ఉంటామని నిత్యం చెప్పే ప్రభుత్వ పెద్దలు జీతాల విషయంలో స్పందించకపోవడం దారుమణని అంటున్నారు.
అధికార పార్టీ కక్కుర్తి..
అరకొర జీతాలు తీసుకునే కార్మికుల గురించి పట్టించుకోకుండా మేయర్ అజీజ్, అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు కోసం పాకులాడడం విమర్శలకు తావిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంట్రాక్ట్ పనులకు సంబంధించి రూ.కోటిపైన బిల్లులకు సంతకాలు జరిగాయని సమాచారం. ప్రతి కాంట్రాక్టర్ వద్ద నుంచి పర్సంటేజీలు కోసం హుటాహుటిన బిల్లులు మంజూరు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే కార్పొరేషన్‌లో ఓ ఉన్నతాధికారి బదిలీపై వెళుతున్నారని ముందస్తు సమాచారం రావడంతో అధికార పార్టీ నాయకులు ఆ అధికారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమ అనుచరులు, అనుకూలమైన కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు వెంటనే చేయాలని మేయర్ వర్గం ఆ అధికారికి హుకుం జారీచేసింది. అదే విధంగా ఉన్నతాధికారి కూడా మేయర్ వర్గం ఆదేశాలను తూచాతప్పకుండా బిల్లులపై సంతకాలు చేస్తూ కార్మికుల గురించి పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి.
అప్పుల్లో ఊబిలో..
కార్మికులకు గత రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అసలే వారికి వచ్చే అరకొర జీతాలతో అవస్థలు పడుతుంటే, పనిచేసిన కాలానికి జీతాలు సమయానికి రాకపోవడంతో అప్పులు పాలవుతున్నారు. కొంతమంది కుటుంబపోషణ కోసం రూ.10 వడ్డీకి అప్పులు తీసుకుని ఇబ్బందులుపడుతున్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు.