నంద్యాల ప్రజలను ఎవరూ మభ్యపెట్టలేరు
- అక్కడ అరాచక పాలన సాగుతోంది
- రోడ్డు విస్తరణతో పది వేల మంది వీధిపాలు
- ఉప ఎన్నికలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
- పాణ్యం పోలీస్ స్టేషన్‌లో బైరెడ్డి ప్రెస్‌మీట్
పాణ్యం : టీడీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నంద్యాలలో అరాచక పాలన సాగుతోందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ కారణంగా పదివేల మంది వీధి పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు ప్రభుత్వ పెద్దలు అభివృద్ధి పేరుతో ప్రకటనలు గుప్పిస్తున్నారని, అయితే అక్కడి ప్రజలను ఎవరూ మభ్యపెట్టలేరని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నంద్యాలలో బైరెడ్డిని శనివారం అరెస్టు చేసిన పోలీసులు పాణ్యం స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్టేషన్‌లో బైరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణ చేపట్టే ముందు ఆయా దుకాణాల యజమానులకు మూడు సార్లు నోటీసులు ఇవ్వాలన్నారు. అయితే ఉప ఎన్నికలో గెలుపు కోసం అడ్డదారిలో పనులకు ఉపక్రమించడం సిగ్గుచేటన్నారు. రాజధాని అమరావతిలో బాధితులకు రెండింతల పరిహారం అందించాక పనులు మొదలెట్టారని, నంద్యాలలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ చర్యల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మంది వరకు వీధిన పడే పరిస్థితి దాపురించిందన్నారు. బాధితుల తరపున పోరాడుతున్న తనకు సమాధానం చెప్పలేక అరెస్టు చేయించారన్నారు. ఎంత మంది మంత్రులు, కలెక్టర్లు, ఐఏఎస్‌లు వచ్చినా ప్రజల మనోభవాలను ఎవరూ మార్చలేరని, ఉప ఎన్నికలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా పాణ్యం స్టేషన్‌లో ఉంచిన బైరెడ్డిని విడుదల చేయాలని కోరుతూ ఆర్‌పీఎస్ కార్యకర్తలు హైవేపై రాస్తారోకో చేశారు. అనంతరం పోలీసులు బైరెడ్డితో మాట్లాడించి కార్యకర్తలను శాంతింపజేశారు.