ఎవరి ధీమా వారిదే!
ఎవరి ధీమా వారిదే!
Published Sat, Aug 26 2017 9:45 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
- ఉప ఎన్నికల ఫలితంపై నేతల్లో టెన్షన్
- గ్రామాల వారీగా లెక్కలు చూస్తున్న వైనం
- రూ.కోట్లలో బెట్టింగ్‌లు
నంద్యాల: ఉప ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన ప్రధాన పార్టీల నాయకులు ప్రస్తుతం ఫలితంపై టెన్షన్‌గా గడుపుతున్నారు. గ్రామాల వారీగా లెక్కలు చూసుకుంటూ విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీ అభ్యర్థుల తరఫున కోట్లాది రూపాయల బెట్టింగ్ కాసిన వారు అభ్యర్థులను మించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. బుధవారం పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించిన అధికారులు సోమవారం కౌంటింగ్‌కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
అంచనాల్లో నిమగ్నమైన నేతలు..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్ధుల్‌ఖాదర్‌తోపాటు మరో 13మంది ఎన్నికలో పోటీ చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన మరు నిమిషం నుంచి వీరంతా వార్డులు, పల్లెల వారీగా ఫలితంపై అంచనాలు వేస్తూ గడుపుతున్నారు. పట్టణంలో 1,42,628 ఓటర్లకు 1,05,629 మంది, రూరల్‌కు సంబంధించి 47,386 ఓటర్లకుగాను 41,514 మంది, గోస్పాడు మండలంలో 28,844 ఓటర్లలో 26,192 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గ చర్రితలో ఎన్నడూ లేని విధంగా 79.20శాతం పోలింగ్ నమోదైంది. ఫలితం మిగిలి ఉండడంతో నాయకుల దృష్టి అటువైపు పడింది. గ్రామాల వారీగా నాయకులు, ఓటర్లకు పంపిణీ చేసిన నగదు, చీరలు, ముక్కుపుడకలు, దేవాలయాలకు అందజేసిన నగదు, వాటి కారణంగా తమకు వచ్చే ఓట్లను అంచనా వేస్తూ గడుపుతున్నారు టీడీపీ నాయకులు.
ఓటింగ్ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన...
నియోజకవర్గంలోని 2,18,858 ఓటర్లలో 1,73,335 మంది ఓటు వేసి రికార్డు సృష్టించడంతో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగితే ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తుందని లోలోన మధనపడుతున్నారు. నియోజకవర్గంలో 1,11,018 మంది మహిళలుండగా 88,503 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరు ఎవరికి ఓటు వేశారనేది అంతు పట్టడం లేదు. గ్రామాల్లో కూడా టీడీపీ నాయకుల అంచనా కన్నా పోలింగ్ శాతం పెరగడం ఆ పార్టీ నాయకుల్లో అలజడి రేపుతోంది. గోస్పాడు, నంద్యాల మండలాల్లోని గ్రామాలు మొదటి నుంచి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండటం, వాటిలో ఓటింగ్ శాతం విపరీతంగా పెరగడం టీడీపీ నాయకుల కలవరపాటుకు కారణంగా మారింది.
పందెంరాయుళ్ల ఉత్కంఠ..
నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫలితంపై నాయకులు, బెట్టింగ్ రాయళ్లు రూ.కోట్లలో పందాలు కాస్తున్నారు. ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే రూ.50కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. స్థానిక నాయకులు సైతం గ్రామాల వారీగా పందె కాస్తున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement