నంద్యాలలో అధికార పార్టీ కక్ష సాధింపు | tdp govt demolished hundreds of houses in nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో అధికార పార్టీ కక్ష సాధింపు

Published Sun, Sep 17 2017 9:29 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

నంద్యాలలో అధికార పార్టీ కక్ష సాధింపు - Sakshi

నంద్యాలలో అధికార పార్టీ కక్ష సాధింపు

► వందల ఇళ్లు కూల్చివేత
► 854 మంది ఇళ్ల పట్టాలు రద్దు
► ఆ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేత
► వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారని పేదలపై కక్ష
► ఇదెక్కడి న్యాయమంటూ వాపోతున్న బాధితులు


సాక్షి, నంద్యాల: అధికార పార్టీ నాయకులు చెప్పినంత పని చేస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేయకపోతే రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్లపట్టాలు రద్దు చేస్తామని ఉప ఎన్నికలో ఓటర్లను భయపెట్టారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు పక్కా గృహాల కూల్చివేతకు పూనుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని అయ్యలూరు మెట్ట వద్ద పేదలు వేసుకున్న స్థలంలోని బేస్‌మట్టాలను, ఇళ్లను పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం తొలగించారు. గృహాల వద్దకు లబ్ధిదారులు ఎవరూ రాకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య, వర్షపు నీటిలోనే పొక్లెయిన్లు పెట్టించి పేదల ఇళ్లను, బేస్‌మట్టాలను తొలగించడం చర్చనీయాంశమైంది.

మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ద్వారా పట్టాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వీరు ఉప ఎన్నికలో టీడీపీకి ఓట్లు వేయలేదని కక్ష సాధింపుతో అధికార పార్టీ నేతలు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈనెల 19న సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటనకు వస్తుండటంతో ఆయన మెప్పు కోసం ఆగమేఘాల మీద పేదల పట్టాలు రద్దు చేసి, ఆ స్థానంలో నిర్మించుకున్న కట్టడాలను కూలగొడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ ప్రచారంలో భాగంగా ఇళ్లులేని నిరుపేదలు 13 వేల మందికి పక్కాగృహాలు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంది. అయితే నేడు టీడీపీకి ఓట్లు వేయలేదంటూ 854 మంది నిరుపేద కుటుంబాల ఇళ్ల పట్టాలను రద్దు చేసి, వారి స్థలాల్లో నిర్మించుకున్న కట్టడాలను కూలగొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.

పక్కాగృహాల కోసం ఏళ్లతరబడి నిరీక్షణ
అయ్యలూరు మెట్ట సమీపాన 852/2, 853 సర్వే నంబర్లలోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2009వ సంవత్సరంలో  854 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1.50 సెంట్ల చొప్పున పంపిణీ చేశారు. వీటికి సంబంధించి అప్పటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి పట్టాలు కూడా అందజేశారు. ఈ స్థలంలో ముళ్లపొదలు ఉండడంతో పాటు వెళ్లేందుకు దారి లేకపోవడంతో లబ్ధిదారులే చందాలు వేసుకుని మార్గం ఏర్పాటు చేసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కాలనీలోకి వర్షపునీరు చేరకుండా కల్వర్టులు, మంచినీటి సౌకర్యం కోసం బోర్లు వేసుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగి విద్యుత్‌ స్తంభాలు, వైర్లు, మెటల్‌రోడ్డు వేయించుకున్నారు.

ఈ స్థలంలో గృహాల మంజూరుకు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇందిరమ్మ పథకం కింద పక్కాగృహాలు మంజూరు కావడంతో నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన లబ్ధిదారులు 2015లో ఇళ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. పక్కాగృహాలు మంజూరైతేనే ఇళ్లు కట్టుకోవాలన్న నిబంధన ఉండటంతో ఎక్కువశాతం మంది నిర్మాణాలు చేపట్టలేదు. మరికొందరు సొంత డబ్బు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అక్కడ నివాసం ఉంటున్నారు.  అధికారపార్టీ పక్కాగృహాలు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తూ ఉప ఎన్నిక నేపథ్యంలో గృహాలు కట్టుకోలేదంటూ పట్టాలు రద్దు చేసింది. ఉప ఎన్నిక అనంతరం వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారని ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నిర్మించిన కట్టడాలను పొక్లెయిన్లతో కూల్చివేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement