ఒక్క హామీ నెరవేర్చని సీఎం
-
ఎల్లంపల్లి నీళ్లు జిల్లా ప్రజలకు ఇచ్చిన తర్వాతనే గజ్వేల్‌కు తరలించాలి
-
ధర్నాలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ : సీఎం హోదాలో కేసీఆర్ 2014 ఆగస్టు 5న తొలిసారిగా పర్యటించిన సందర్భంగా నాలుగు గంటల్లో నలభై హామీలిచ్చారని, రెండేళ్లు గడుస్తున్నా వాటిని నెరవేర్చలేదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎల్లంపల్లి నీటిని హైదరాబాద్, మెదక్ జిల్లాలకు తరలించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా ప్రజల నీటి అవసరాలు తీర్చిన తర్వాతనే ఎల్లంపల్లి నీటిని ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎల్లంపల్లి నీటిలో జిల్లా వాటాను సాధించేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనన్నారు. సీఎం కేసీఆర్ తొలిసారి కరీంనగర్‌లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. హామీలు నేరవేర్చని సీఎంపై క్రిమినల్ కే సు నమోదు చేయాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మాట తప్పడం కేసీఆర్ నైజం కాదని ఎంపీ వినోద్‌కుమార్ పత్రికల ద్వారా ప్రచారం చేసుకోవడం తగదన్నారు. జిల్లా పర్యటనలో కేసీఆర్ ఇచ్చిన నలభై హామీల్లో ఎన్ని నెరవేర్చాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఎనభై వేల పవర్‌లూమ్స్ ఉన్న సిరిసిల్లను కాదని వరంగల్‌కు టైక్స్‌టైల్స్ జోన్‌ను తీసుకెళ్లడం శోచనీయమన్నారు. కరీంనగర్‌ను ఊహించని విధంగా లండన్, న్యూయార్క్ మాదిరిగా అభివృద్ధి చేస్తానని, ఎల్‌ఎండీలో మైసూర్‌లోని బందావన్ గార్డెన్‌ను తలపించేలా మూడు వందల ఎకరాల్లో ఉద్యానవనంగా తీర్చిదిద్దుతానని, నేదునూర్ గ్యాస్ ఇవ్వకుంటే జెన్‌కో ద్వారా థర్మల్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జిల్లా ఆస్పత్రిని నిమ్స్ స్థాయిలో అబివద్ధి చేసి దానికి అనుబంధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. టీఆర్‌ఎస్ నాయకులకు చాతనైతే జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై కేసీఆర్‌తో చెప్పించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్, హుజూరాబాద్ ఆర్టీఓ కార్యాలయాలపై దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దుబారా ఖర్చు చేస్తుందే తప్ప నిర్మాణాత్మకమైన పనులు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రం విడిపోయాకా రూ.60వేల కోట్ల అప్పులు ఉంటే ప్రస్తుతం రూ.లక్షా 60వేల కోట్ల అప్పులయ్యాయని అన్నారు.