నీరు చెట్టు అక్రమార్కులకు రికవరీ నోటీసులు | notice issued | Sakshi
Sakshi News home page

నీరు చెట్టు అక్రమార్కులకు రికవరీ నోటీసులు

Published Tue, Oct 25 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

చర్యల తాత్సారంపై 'సాక్షి'లో ప్రచురించిన కథనం కిప్పింగ్‌

చర్యల తాత్సారంపై 'సాక్షి'లో ప్రచురించిన కథనం కిప్పింగ్‌

ఎట్టకేలకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నీరు చెట్టు అక్రమాలపై కొరడా ఝుళిపించారు. సాక్షిలో వచ్చిన కథనాలపై తీవ్రంగా స్పందించారు. మింగిన నిధులు కక్కించేందుకు నడుంబిగించారు. రెండు కోట్ల 32లక్షల పైచిలుకు నిధులు రాబెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు అక్రమార్కులకు నోటీసులు జారీ చేసి వారంరోజుల్లో ఆ మొత్తాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. వాటిని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ పేరున డీడీ రూపంలో ఇవ్వాలని

రూ. 2కోట్ల 32లక్షల మేర చెల్లించాలని ఆదేశాలు
69మందిని బాధ్యుల్ని చేసిన అధికారులు
ఇరిగేషన్‌ డీఈఈ, ఏఈఈలపై కూడా సస్పెన్షన్‌ వేటు   
కోటశిర్లాం, ఆరికతోట, రామభద్రపురంలోని పలు పనులపై పునర్విచారణకు ఆదేశం
యంత్రాంగాన్ని కదిలించిన సాక్షి కథనాలు
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం  ఎట్టకేలకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నీరు చెట్టు అక్రమాలపై కొరడా ఝుళిపించారు. సాక్షిలో వచ్చిన కథనాలపై తీవ్రంగా స్పందించారు. మింగిన నిధులు కక్కించేందుకు నడుంబిగించారు. రెండు కోట్ల 32లక్షల పైచిలుకు నిధులు రాబెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఈ మేరకు అక్రమార్కులకు నోటీసులు జారీ చేసి వారంరోజుల్లో ఆ మొత్తాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. వాటిని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ పేరున డీడీ రూపంలో ఇవ్వాలని సూచించారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు ఇరిగేషన్‌ డీఈఈ, ఏఈఈలను కూడా సస్పెండ్‌చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రామభద్రపురంలో ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు చేపట్టిన పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సెప్టెంబర్‌ 9వ తేదీన 22 గ్రామ పంచాయతీలకు సంబంధించి సోషల్‌ ఆడిట్‌ బృందాలు నివేదికలు ఇచ్చాయి. క్షేత్రస్థాయి పనికన్న ఎంబుక్‌లో ఎక్కువ కొలతలు నమోదు చేశారని, పనులు జరగకపోయినా ఎంబుక్‌లో తప్పుడు కొలతలు వేశారనీ, ఎంబుక్‌లో నమోదు చేసిన కొలతలకు, క్షేత్రస్థాయి వాస్తవానికి భారీ వ్యత్యాసం ఉందని, పనిని పర్యవేక్షించకుండానే వేతనాలు చెల్లించారని, ఫొటోలు అప్‌లోడ్‌ చేశారని, సోషల్‌ ఆడిట్‌ బృందాలు నివేదికలు ఇచ్చాయి. కోటశిర్లాం, ఆరికతోట, రామభద్రపురం తదితర పంచాయతీల్లో అత్యధిక పనులకు సంబంధించి పరిశీలించేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పునర్విచారణకు సూచించాయి. వీటిని మినహాయించినప్పటికీ 2కోట్ల 32లక్షల 21వేల 330మేర అవినీతి జరిగినట్టు సోషల్‌ ఆడిట్‌ నిగ్గు తేల్చింది. దాని ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించాయి. కానీ చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న తాత్సారంపై 'సాక్షి' దినపత్రికలో  'నిధులు మింగి నిర్బయంగా' అక్రమార్కులు తిరుగుతున్నారని ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.  అవినీతిలో ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారుల భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ డీఈఈ బాలసుందరరావు, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పి.వి.వి.సతీష్‌కుమార్‌లను సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించినప్పటికీ బేఖాతర్‌ చేశారని ప్రస్తావిస్తూ 'నీరు గార్చేస్తున్నారు' శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందిస్తూ తాజాగా చర్యలకు ఉపక్రమించారు. డీఈఈ బాలసుందరావును, ఏఈఈ సతీష్‌కుమార్‌ను తాజాగా సస్పెండ్‌ చేస్తూ ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. 
 
 
69మందికి రికవరీ నోటీసులు 
ఇప్పటివరకు తేలిన అక్రమాల మేరకు 69మందిని బాధ్యులుగా గుర్తించారు. వారందరికీ రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకుంటున్న వారిలో ఒక ఇరిగేషన్‌ ఈఈ, డీఈఈ, నలుగురు ఏఈఈలు, ఎంపీడీఓ, డ్వామా ఏపీఓ, ముగ్గురు ఇంజినీరింగ్‌ కన్సల్సెంట్లు, ఎనిమిది మంది టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్, 20మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు, నలుగురు బ్రాంచి పోస్టుమాస్టర్లు, 9మంది సర్పంచ్‌లు, ఇద్దరు సీనియర్‌ మేట్‌లు, 14మంది రైతులు ఉన్నారు. నోటీసులు అందుకున్న వారం రోజుల్లో వీరంతా నిధులు చెల్లించాలని, ఈలోగా స్పందించకపోతే శాఖా పరంగా చర్యలు తీసుకోవడంతో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎవరి నుంచి ఎంత రికవరీ
హోదా రికవరీ మొత్తం
ఈఈ 20,39,932
డీఈఈ 61,81,844
ఎంపీడీఓ 31,70,586
ఏపీఓ 33,60,738
ముగ్గురు ఈసీలు  3,96,378
ఎనిమిది టీఎలు 12,53,865
20మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు 12,09,549
నలుగురు బీపీఎంలు 19,288
9మంది సర్పంచ్‌లు 18,00,561
ఇద్దరు సీనియర్‌ మేట్‌లు 1000
14మంది రైతులు 12511
-------------------------------
పంచాయతీల వారీగా అవినీతి చిట్టా
ముచ్చర్లవలసలో రూ. 27,97,845, ఎస్‌.సీతారాంపురంలో రూ. 19,02,207, రామభద్రపురంలో రూ. 13,46,392, సోంపురంలో రూ. 7,01,366, బూసాయవలసలో రూ. 9,33,366, కొండ కెంగువలో రూ. 23, 95,059, జన్నివలసలో రూ. 14,28,045, మామిడివలసలో రూ. 6,87,506, మిర్తివలసలో రూ. 9,77,996, దుప్పలపూడిలో రూ. 23,09,720,ఇట్లా మామిడిపల్లిలో రూ. 3,21,064, కొట్టక్కిలో రూ. 10,02,774, ఆరికతోటలో రూ. 39,91,066 మేర అక్రమాలు జరిగినట్టు సోషల్‌ ఆడిట్‌ నివేదిక ఆధారంగా స్పష్టమవుతోంది. 
అనుమానాలెన్నో
సోషల్‌ ఆడిట్‌ బృందాలు 22పంచాయతీలపై నివేదికలు ఇచ్చాయి. కానీ తాజాగా జారీ చేసిన రికవరీ నోటీసుల్లో తొమ్మిది మంది సర్పంచ్‌ల పేర్లు మాత్రమే ఉన్నాయి. మిగతా గ్రామాల సర్పంచ్‌ల మాటేంటన్న వాదనలు ఉన్నాయి. అవినీతి ఎక్కువగా జరిగిన కోట శిర్లాం వ్యవహారం నేటికీ కొలిక్కి రాలేదు. ఆరికతోట, రామభద్రపురంలో అత్యధిక పనులపై విచారణ చేయాల్సి ఉందని చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతున్నా దీనివెనుక ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనుల రికార్డు, చెక్‌ మెజర్‌మెంట్, పే ఆర్డర్‌ తదితరాలన్నీ చేసింది ఇంజనీరింగ్‌ అధికారులే అయితే ఏపీఓకు దాదాపు రూ. 33లక్షల రికవరీకి ఆదేశించడం ఎంతవరకు సమంజసమనే వాదనలు విన్పిస్తున్నాయి. అసలు డ్వామా ఉద్యోగులకు నీరు చెట్టు పనులతో సంబంధం లేదని ఒకవైపు చెబుతూ, మరోవైపు ఆ స్థాయిలో రికవరీకి ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అక్రమాలు కొన్నివి
– రామభద్రపురం మండలం ముచ్చర్లవలసలోని అయ్యన్నకోనేరు వద్ద చప్టా రిటర్న్‌ వాల్‌ నిర్మించారు. 159.11క్యూబిక్‌ మీటర్ల పని చేసినట్టు ఎంబుక్‌లో రికార్డు చేశారు. కాని అక్కడ 39.07క్యూబిక్‌ మీటర్ల పనే జరిగింది. ఇక్కడ ఎప్రాన్‌ బ్రెడ్డింగ్, ప్రొటెక్షన్‌ వాల్‌ నిర్మాణం చేపట్టలేదు. ఈ విధంగా చేయని పని కోసం రూ. 9లక్షల 51వేల 85లు అదనంగా చెల్లించారు. 
– రామభద్రపురం మండలం మిర్తివలసలో రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ ట్యాంకులో భాగంగా పాత నిర్మాణాన్నే చూపించి రూ. 3,45, 508 డ్రా చేసేశారు. సోషల్‌ ఆడిట్‌ తనిఖీల్లో కొత్త నిర్మాణమేది కన్పించలేదు. 
– రామభద్రపురం మండలం దుప్పలపూడిలో కూర్మన్నబందలో చేపట్టిన స్లూయిస్‌ నిర్మాణం పైపై మెరుగులతోనే కానిచ్చేశారు. పాత పనికి కొద్దిగా మెరుగులు దిద్ది రూ. 5,51,507 డ్రా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement