- 3 సర్పంచ్, 21 వార్డు సభ్యుల స్థానాలు
- 26వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
- సెప్టెంబర్ 8న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు
ఖాళీ జీపీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్
Published Fri, Aug 19 2016 11:59 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
ఆదిలాబాద్ రూరల్ : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న ఉదయం 11.00 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 31న ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవడం. సెప్టెంబర్ 1న అప్పీల్ చేసుకున్న వాటిని పరిష్కరించడం, 3న మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఉపసంహరణ, అనంతరం అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. 8వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఎన్నికల నిర్వహణ జరుగనుంది. అదే రోజున మధ్యాహ్నం 2.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపు ఓటమిల జాబితాలు విడుదల కానున్నాయి.
ఎన్నికల జరిగే స్థానాలు ఇవే..
జిల్లా వ్యాప్తంగా మూడు సర్పంచ్, 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఆదిలాబాద్ మండలంలోని వాన్‌వాట్, బజార్‌హత్నూర్ మండలం ధర్మపూరి, ఖానాపూర్ మండలం వెంకంపోచంపాడ్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భైంసా మండలంలోని వాలేగాం 7వ వార్డు, దండేపల్లి మండలం తల్లపేట్ జీపీలోని 3వ వార్డు, దిలావర్‌పూర్ మండలం సముందర్‌పల్లి జీపీలోని 5వ వార్డు, ఇచ్చోడ మండలం గేర్జం జీపీలోని 7వ వార్డు, ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి 7వ వార్డు, జైనథ్ మండలం అడ 3వ, 6వ వార్డులు, తరోడా(బి) జీపీలోని 8వ వార్డు, జైపూర్ మండలం బేజ్జల్ 4వ, ఇందారం గ్రామ పంచాయతీలోని 3వ వార్డు శెట్‌పల్లి జీపీలోని 9వ వార్డు, శివరాం జీపీలోని 6వ వార్డు, శివ్వరాం 6వ వార్డు, కాగజ్‌నగర్ మండలం భట్‌పల్లి జీపీలోని 5వ వార్డు, ఖానాపూర్ మండలం సుర్జాపూర్ జీపీలోని 3వ వార్డు, లోకేశ్వరం మండలం గఢ్‌చంద్ జీపీలోని 6వ వార్డు, పోట్‌పల్లి(బి) జీపీలోని 2వ వార్డు, మామడ మండలం పొన్కల్ 2వ వార్డు, ముథోల్ మండలం బాసర 6వ వార్డు, సారంగపూర్ మండలం పోటియా జీపీలోని 6వ వార్డు, సిర్పూర్ మండలం చోర్‌పల్లి జీపీలోని 5వ వార్డు, తాండూర్ మండలం కొత్తపల్లి జీపీలోని 13వ వార్డు స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.
Advertisement
Advertisement