ఇక అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే!
ఇక అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే!
Published Thu, Feb 16 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
– ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్ కోసమే
ఆర్‌టీఏ కార్యాలయానికి..
– ఏప్రిల్ నుంచి జిల్లాలో అమలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రవాణా సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే లభించనున్నాయి. రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లకుండానే సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఆ తర్వాత కేవలం వాహనాల ఫిట్‌నెస్ టెస్టింగ్‌తో పాటు లెర్నింగ్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం మాత్రమే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి రానుంది. ఇక మిగిలిన సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే లభించనున్నాయి. ప్రాథమికంగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని విశాఖపట్నంలో ఫిబ్రవరి 15న ప్రారంభించినట్టు రవాణాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి కర్నూలు జిల్లాలో అమలు చేయనున్నట్టు సమాచారం.
రెండో వాహనం కొనుగోలు చేసినా..
ప్రస్తుతం కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ మినహా మిగిలిన పనులన్నింటికీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అయితే, కొత్త విధానంలో కొత్త వాహనానికి పర్మినెంటు నెంబర్ కూడా షోరూంలలోనే లభించనుంది. అంతేకాకుండా వాహనం ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేసినా కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్‌సీ మార్చుకునేందుకు వీలు కలగనుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాహనాల ఫీజుల చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లోనే చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సెకండ్‌హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం ఒకచోట ఉండి.. ఆధార్‌కార్డులో ఉండే అడ్రస్ వేరే చోట ఉంటే అక్కడికే వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తోంది. ఇది అదనపు భారంగా ఉంటోంది. తాజాగా అమల్లోకి రానున్న ఆన్‌లైన్ విధానంలో నెట్ ద్వారా రవాణాశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సదరు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా రవాణాశాఖలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలు కూడా తగ్గిపోతాయనేది ఉన్నతాధికారుల ఆలోచనగా ఉంది.
షోరూంలలోనే హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్లు
ప్రస్తుతం కొత్తగా షోరూంలో వాహనాన్ని కొనుగోలు చేస్తే అక్కడికక్కడే తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారు. పర్మినెంట్ నెంబర్ కోసం మళ్లీ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా పర్మినెంట్ నెంబర్ వచ్చిన తర్వాత కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేటు వచ్చేందుకు మరో వారం, పదిరోజులు పడుతోంది. అన్ని రోజులు ఆగిన తర్వాత మళ్లీ సదరు సంస్థ నిర్దేశించిన సమయంలోనే వెళ్లి నెంబర్ ప్లేటు బిగించుకోవాల్సి ఉంటుంది. అయితే, తాజా విధానంలో హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను కూడా వాహనాల షో రూంకే అప్పగిస్తారు. తద్వారా వాహనదారులకు అదనపు భారం తగ్గుతుందని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement