రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం
రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం
Published Mon, Oct 17 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
ఇకపై డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్లు
– దశల వారీగా 80 రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే..
– జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం
కర్నూలు: రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు రంగం సిద్ధమయింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శక పాలన అందించేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. అదేవిధంగా మరో అడుగు ముందుకేసి ఆ శాఖ ద్వారా అందిస్తున్న 80 రకాల సేవలను దశల వారీగా ఆన్‌లైన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందేందుకు చర్యలు చేపట్టారు. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగనవసరం లేదు. మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం అసలే ఉండదు. ఈ–ప్రగతి నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ఆన్‌లైన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గతంలో కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ డీలర్ల వద్దే అందజేస్తుండగా.. ఆ తర్వాత ఆర్‌టీఏ కార్యాలయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ఆన్‌లైన్ విధానంతో శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా డీలర్ల వద్దే నిర్వహించేలా చర్యలు ప్రారంభించారు. వాహనం కొనుగోలు చేసిన 24 గంటల లోపే శాశ్వత రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఈ విధానం విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద పట్టణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత అందులో లోటుపాట్లు తెలుసుకుని వాటిని సరిచేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కర్నూలులో కూడా అమలులోకి తెచ్చారు. ఆన్‌లైన్ ప్రక్రియ అమలుపై డీలర్లకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులను కూడా ఆర్‌టీఏ అధికారులు నిర్వహించారు. జిల్లాలో ఆన్‌లైన్ విధానం అమలుకు హైదరబాదుకు చెందిన ఓటీఎస్ ప్రకాష్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించారు.
ఇంటినుంచే..
తాజాగా ప్రతిపాదించిన నూతన విధానంతో రవాణా శాఖ ద్వారా అందించే 80 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారానే పొందే వీలుంది. దరఖాస్తుదారుడు ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చొని వాహన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తనకు కావలసిన సేవలను దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలంటే దానికి సంబంధించిన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. ఇంజన్ నెంబర్, ఛాసిస్ నెంబర్ టైప్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఈ తరహా విధానం ద్వారా ప్రజలకు సమయం ఆదాతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుంది.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం...
కర్నూలు నగర శివారులోని సంతోష్‌నగర్ వద్దనున్న ప్రీమియం హోండా షోరూమ్‌లో సోమవారం సాయంత్రం ఆన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాపరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎస్పీ ఆకే రవికృష్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టారు. మొదటి కొనుగోలుదారుడు పి.ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి హోండా కారుకు మొదట తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం, ఆన్‌లైన్ సేవలతో పది నిముషాల అనంతరం శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాన్ని అందజేశారు. ఏపీ21 బీపీ 0002 వాహనానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించారు. కార్యక్రమంలో డీటీసీ ప్రమీల, కర్నూలు, నంద్యాల ఆర్‌టీఓలు జగదీశ్వర్‌రాజు, హరిప్రసాద్, ఎంవీఐలు శ్రీకాంత్, శివశంకర్, శ్రీనివాసరావు, ఏఎంవీఐ స్వాతి, ఏఓలు జాన్‌పాల్, శ్రీనివాసులు, ప్రీమియం హోండా అధినేత ప్రసాదరెడ్డి, వివిధ షోరూమ్‌ల డీలర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరికీ ప్రీమియం హోండా షోరూమ్ ఆధ్వర్యంలో జ్ఞాపికలను అందజేశారు.
ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలి
రవాణా శాఖలో వస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ప్రజలు సేవలను వినియోగించుకోవాలి. జిల్లాలో నూతనంగా అమల్లోకి వచ్చిన ఆన్‌లైన్ విధానం ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరం. మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు.
- ప్రమీల, డీటీసీ
Advertisement
Advertisement