నర్సరీ రైతులను మోసగిస్తున్న ఎమ్మెల్యే బుచ్చయ్య
-
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
కడియం (రాజమండ్రి రూరల్) : కడియం ప్రాంత నర్సరీ రైతులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. పార్టీ రూరల్ కోఆరి్డనేటర్ ఆకుల వీర్రాజు, పలువురు నర్సరీ రైతులతో కలిసి మండలంలోని బుర్రిలంకలోగల తాడాల చక్రవర్తి నర్సరీలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వందలాది మంది రైతులు తమ సమస్యను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఇంటికి వెళితే డీఈ స్థాయి అధికారితో మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యుత్‌శాఖ మంత్రితోనో, సీఎండీతోనో మాట్లాడితే రైతుల సమస్యను వారి దృష్టిలో పెట్టినట్‌లైనా ఉంటుందని, కానీ డీఈ స్థాయి అధికారితో మాట్లాడి రైతుల సమస్యను ఏ విధంగా పరిష్కరిద్దామనుకుంటున్నారని? ప్రశ్నించారు. అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు వినతి మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి ఇచ్చిన మినహాయింపును ఇప్పటి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోందో? సమాధానం చెప్పాలన్నారు. కడియం ప్రాంత నర్సరీ రైతులపై కరెంటు బండను మోపడం వెనుకున్న ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. గతంలో కూడా మీటర్లు పెట్టే ప్రయత్నం చేసినందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇంటికెళ్లిపోయిందని గుర్తు చేశారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా జక్కంపూడి రామ్మోహనరావు కరెంటు మీటర్లకు వ్యతిరేకంగా ఒక్కడే పోరాడారన్నారు. రామ్మోహనరావు కంటే బాగా చేస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న గోరంట్ల ఇక్కడి నర్సరీ రైతులకు ఇచ్చే బహుమానం ఇదేనా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో సహా టీడీపీ ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి పోరాటానికి దిగితే రైతులకు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం ఎందుకివ్వదన్నారు. పలు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్లో సైతం నర్సరీలను వ్యవసాయ కేటగిరీలుగానే భావించి, మినహాయింపులు ఇవ్వాలని తీర్పునిచ్చాయని గుర్తు చేశారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యాదల సతీష్‌చంద్రస్టాలిన్, జిల్లా సహాయ కార్యదర్శి తాడాల విష్ణుచక్రవర్తి, మాజీ ఎంపీటీసీ బుడ్డిగ వీరవెంకట్రావుగౌడ్, పార్టీ జిల్లా కార్యదర్శులు సంగిత వేంకటేశ్వరరావు, కొత్తపల్లి రాము, కడియం మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి పాల్గొన్నారు.