ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
బిట్రగుంట : బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం కొండ దిగువన సూళ్లూరుపేటకు చెందిన మద్దిక వేణుగోపాల్ రెడ్డి (62) ఆదివారం తెల్లవారుజామున వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిట్రగుంట పోలీసుల కథనం మేరకు.. సూళ్లూరుపేటలోని పొట్టిశ్రీరాములు వీధికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి మూడు రోజుల క్రితం కొండబిట్రగుంటకు వచ్చి కొండ వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కొండ దిగువన ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌కార్డ్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఎస్‌ఐ గిరిబాబు విచారణ చేపట్టగా మృతుడి వివరాలు వెల్లడయ్యాయి. కడపకు చెందిన వేణుగోపాల్ రెడ్డి పదేళ్ల క్రితం వెంకటగిరికి వచ్చి స్థానికంగా హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో నాలుగు నెలల క్రితం అక్కడ పనిమానేసి వెళ్లిపోయాడు. జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ కొండబిట్రగుంటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.