ప్రియురాలి మృతితో ప్రియుడి ఆత్మహత్యాయత్నం
కావలి : ప్రియురాలు సూసైడ్ చేసుకుందని కలత చెందిన ఓ ప్రియుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తనచావుకు ఎవరూ కారణం కాదని డీఎస్పీకి సూసైడ్ లేఖ ఇచ్చేందుకు వచ్చి స్పృహ తప్పిన వైనం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.... వరికుంటపాడు మండలం తూర్పుబోయడుగులకు చెందిన గురవయ్య పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కావాలిలోనే ఉంటూ అప్పుడప్పుడు తిరుపతికి వెళ్లి వస్తుంటాడు. స్థానిక జనతాపేటలోని వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న బాబు అనే వ్యక్తితో ఇతనికి పరిచయం ఉంది.
నిన్నసాయంత్రం బాబుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, చదువుపరంగా తనకు చేసిన సహాయం మరవలేనని తెలిపాడు. అనంతరం సెల్ ఫోన్ స్విచాఫ్ చేశాడు. రాత్రి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తన చావుకు ఎవరూ కారణం కాదనే సూసైడ్ లేఖను డీఎస్పీ బాలవెంకటేశ్వరావుకు ఇచ్చేందుకు వచ్చాడు. అప్పటికే పురుగుల మందు తాగి ఉన్న అతను అస్వస్థతకు గురై పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించింది పోలీసులు అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.