దొంగను పట్టించిన పాత నోట్ల మార్పిడి
దొంగను పట్టించిన పాత నోట్ల మార్పిడి
Published Mon, Nov 21 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
- బ్యాంకులో మార్చుకునేందకు వచ్చి పట్టుబడిన వైనం
పాత నోట్ల మార్పిడితో బ్లాక్‌మనీ ఎంత బయటపడుతుందో ఏమో కానీ గతంలో చోరీకి పాల్పడిన ఓ దొంగ మాత్రం పోలీసులకు చిక్కాడు. దాదాపు ఐదు నెలల క్రితం ఇంట్లో రూ. 2 లక్షలు అపహరించిన వ్యక్తి ఇప్పటి వరకు కొంత ఖర్చు చేయగా మిగతా నోట్ల మార్చుకునేందుకు బ్యాంకు వద్దకు వచ్చి పోలీలకు దొరికాడు. ఈ ఘటన కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. - కర్నూలు
కల్లూరులోని గీతానగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణ కుమారుడు సాయి విజయ్‌కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేసి నగరంలో నడుపుతున్నాడు. ఇదే క్రమంలో జల్సాలకు అలవాటుపడి ఆటో ఫైనాన్స్ చెల్లించలేక అప్పుల పాలయ్యాడు. రుణాన్ని తీర్చేందుకు చోరీకి పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం, జోగుళాంబ గద్వాల జిల్లా, అలంపూర్‌లో సబ్ పోస్టుమాస్టరుగా పని చేస్తున్న చంద్రునాయక్ కర్నూలు నిర్మల్‌నగర్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. 2016 జూన్ 3వ తేదీన తన మామ నానునాయక్ రూ.2 లక్షలు అప్పు ఉండటంతో చెల్లించాడు. ఆ మొత్తంతో పాటు బ్యాంకు పాసుబుక్కులు, పోస్టల్ ఆర్డీ బుక్కులు, ఏటీఎం కార్డులు బ్యాగులో పెట్టుకొని అదే రోజు రాత్రి నిర్మల్‌నగర్‌లో ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో బ్యాగును మంచంమీద పెట్టి తలుపులు తెరిచి ఉంచి నిద్రపోయాడు. అదే సమయంలో అక్కడికి సమీపంలో ప్రయాణికుడిని దించేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్ సాయి విజయకుమార్ ఇంటి తలుపులు తెరిచి ఉంచడం గమనించి ఇంట్లోకి వెళ్లాడు. మంచం మీద బ్యాగును తీసుకుని ఉడాయించాడు. బ్యాగ్‌లో ఉన్న డబ్బును తీసుకుని మిగతా వస్తువులతో పాటు బ్యాగును కేసీ కెనాల్‌లో పారవేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో చేపట్టారు.
ఇలా దొరికాడు:
దొంగలించిన సొమ్ముతో అప్పులు కట్టుకోవడంతో పాటు అవసరాలకు ఖర్చు పెట్టాడు. అతని దగ్గర రూ. 83 వేలు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద నోట్లు మార్పిడి చేసుకోవాల్సి రావడంతో సోమవారం కృష్ణానగర్ జంక‌్షన్‌లోని ఎస్‌బీఐ వద్దకు చేరుకున్నాడు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో గస్తీలో ఉన్న నాలుగో పట్టణ సీఐ నాగరాజురావు, సిబ్బంది సాగర్, శ్రీను, ఆచారి తదితరులు అతడిని విచారించారు. రూ. 83 వేలకు ఆధారాలు చూపాలని నిలదీయడంతో జూన్ నెలలో నిర్మల్‌నగర్‌లో చంద్రూనాయక్ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరు పరిచారు.
Advertisement
Advertisement