దేవాధిదేవులంటే ధిక్కారమా..?
దేవాధిదేవులంటే ధిక్కారమా..?
Published Mon, Aug 1 2016 9:35 PM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
శిథిలమవుతున్న పురాతన ఆలయాలు
పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు
తాడేపల్లి మండల, పట్టణ పరిధుల్లో ఉన్న దేవాలయాలకు కోట్ల విలువ చేసే భూములు ఉన్నా ధూప దీప నైవేద్యాలు కూడా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నాయి. ఓ వైపు ప్రై వేటు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయాలు నిర్మించి నిధులను సేకరిస్తుంటే, పురాతన కాలం నుంచి ఉన్న దేవాలయాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. అయినా దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవటం లేదు.
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): రానున్న పుష్కరాలకు దేవాలయాలు అన్నింటికీ మరమ్మతులు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు రూ. 40 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కానీ తాడేపల్లి పట్టణ, మండల పరిధిల్లో ఉన్న దేవాలయాలకు పైపై అద్దకాలు చేస్తున్నారు తప్పా పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించడం లేదు. కోట్ల ఆస్తులు ఉన్నా, పూజలకు కూడా నోచుకోని పరిస్థితుల్లో దేవాలయాలు ఉన్నాయంటే అధికారుల నిర్వాకం అర్థం అవుతూనే ఉంది.
కోట్ల విలువ చేసే భూములు..
సీతానగరం శ్రీకోదండరామాలయానికి కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. దాంతోపాటు దేవాలయం ముందు భాగంలోనే 80 సెంట్ల స్థలం కూడా ఉంది. ఆ స్థలంలో దేవాదాయ శాఖ అధికారులు అన్ని హంగులతో కార్యాలయాన్ని నిర్మించుకున్నారు తప్పా కనకదుర్గమ్మ దత్తత దేవాలయంగా ఉన్న రామాలయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. వందల సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం జరిగింది. ఈ దేవాలయానికి కొన్ని సంవత్సరాల క్రితం దాతల సాయంతో మండపం, ధ్వజస్తంభాలకు వెండి తొడుగులు ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఎండోమెంటు శాఖ ఆధీనంలోకి వెళ్లిన తరువాత అభివృద్ధికిS నోచుకోలేదు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి గుడి శిథిలావస్థకు చేరడంతో అధికారులు దాన్ని తొలగించారు తప్ప పునర్నిర్మాణం మాత్రం చేపట్టలేదు. కోదండరామస్వామి ఆలయ ఆస్తులు అనుభవిస్తున్నారు తప్ప దాని అభివృద్ధి మాత్రం ఆలోచించడంలేదు. వడ్డేశ్వరంలో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న తిరునారాయణ స్వామి దేవాలయానికి రాజధాని పరిధిలో 8 ఎకరాల మాగాణి భూమి, తాడేపల్లి మండలంలో 3.5 ఎకరాలు, అమరావతి మండలంలో 12 ఎకరాల భూమి ఉన్నప్పటికీ దాని అభివృద్ధి మాత్ర శూన్యం.
రాజధాని నిర్మాణం పేరుతో..
రాజధాని పరిధిలో ఉన్న కోట్ల విలువ చేసే భూమిని రాజధాని నిర్మాణానికి తీసుకున్నారు. ఇక్కడ కనీసం పూజారులకు జీతాలు కూడా అందజేయలేని పరిస్థితి. ఉండవల్లిలో భీమలింగేశ్వర స్వామి ఆలయంలో నిరంతరం పూజలు నిర్వహించేందుకు దాతలు 2.5 ఎకరాల భూమిని అందించారు. ఆ భూమిని దేవాదాయ శాఖ ఏనాడో అమ్మేసింది. కనీసం ఇక్కడ శివరాత్రికి కూడా దేవాదాయ శాఖ వారు పూజలు నిర్వహించరు. తాడేపల్లి పట్టణ పరిధిలో భీమలింగేశ్వర స్వామి ఆలయానికి 3.75 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కోట్ల విలువ ఉన్నా ఓ ప్రై వేటు సంస్థ క్లబ్ నిర్వహించేందుకు నామమాత్రంగా నగదు చెల్లిస్తుండటంతో ఆలయ అభివృద్ధి జరగడంలేదు. దేవాదాయ అధికారులు దృష్టి సారించి, పూర్వం నుంచి ఉన్న దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయాలని పలువురు అర్చకులు, భక్తులు కోరుతున్నారు.
Advertisement