పింఛను అందక వృద్ధురాలి మృతి
Published Tue, Dec 6 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
గడివేముల: కుటుంబానికి ఆసరగా ఉంటున్న పింఛను అందకపోవడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా గడివేములలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దూదేకుల హుసేనమ్మ(65) గత మూడు రోజులుగా తనకు రావాల్సిన వితంతు పింఛన్ డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. సోమవారం కూడా బ్యాంకుకు మూడు పర్యాయాలు తిరిగింది. బ్యాంకు వద్ద ఎంతకీ క్యూ తగ్గకపోవడంతో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముఖం పట్టింది. అయితే పాత పోలీసుస్టేషన్ వద్దకు చేరుకోగానే బీపీ తగ్గిపోయి పడిపోగా స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే ఆమెను 108 వాహనంలో నంద్యాలకు తరలిస్తుండగా గడివేముల పొలిమేరకు చేరుకోగానే మరణించింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. ఈ కుటుంబానికి అవసరమైన నిత్యావసరాల కొనుగోలుకు పింఛను ఒక్కటే ఆధారం కావడం.. ఐదు రోజులు గడుస్తున్నా ఆ మొత్తం అందకపోవడంతోనే హుసేనమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement