నగదు కొరత..తీరని వ్యథ
నగదు కొరత..తీరని వ్యథ
Published Mon, Dec 19 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
- మారని బ్యాం‘క్యూ’ల తీరు
- ఏటీఎంలదీ అదే పరిస్థితి
- డబ్బు వచ్చినా..పంపిణీ నామమాత్రం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నగదు కష్టాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు డబ్బులేక సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలలో 20 రోజులైనా కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ ఖాతాలో జమైన డబ్బు తీసుకోలేని పరిస్థితి. జిల్లాలోని ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీలకు కలిపి 148 కోట్ల కొత్త కరెన్సీ వచ్చింది. సోమవారం ఈ కరెన్సీ అందుబాటులోకి వచ్చినా.. పలు బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. కలెక్టరేట్‌లోని ట్రెజరీ బ్రాంచీ సహా దాదాపు అన్ని ఎస్‌బీఐ బ్రాంచిల్లో ఖాతాదారులకు రూ.4000 ప్రకారమే పంపిణీ చేశారు. కొన్ని బ్యాంకుల్లో రూ.2000 ప్రకారం ఖాతాదారులకు అందించారు.
జీతాలు తీసుకోని ఉద్యోగులు 2వేలు పైనా..
డిసెంబరు నెలలో 20 రోజలు గడుస్తున్నా ఇప్పటికీ జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోని ఉద్యోగులు 2వేల పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు ఉండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం.. బయట నగదు కొరత తో అప్పులు పుట్టకపోవడంతో ఉద్యోగులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు.
డిపాజిట్లు రూ. 8వేల కోట్లు
కేంద్ర ప్రభుత్వం నవంబరు 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోనే అన్నిబ్యాంకులకు దాదాపు 8వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చాయి. ప్రజలు దాచుకున్న డబ్బులు బ్యాంకులకు వెళ్లినా ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు వచ్చిన మొత్తం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో నగదు కొరత తీవ్రం అయింది.
అడ్డదారుల్లో తరలుతున్న కరెన్సీ కట్టలు....
జిల్లాకు వచ్చిన కరెన్సీ అడ్డదారుల్లో తరలుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. సామాన్యులను మూడు, నాలుగు గంటలు వరుసలో పెట్టి రూ. 2000 ఇస్తున్న బ్యాంకర్లు కొంత మందికి మాత్రం అడ్డుగోలుగా కరెన్సీ కట్టలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు, ఆదోని, డోన్‌లోని ప్రధాన బ్యాంకు శాఖల నుంచి రూ. 2000 నోట్ల కట్టలు అడ్డదారుల్లో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు బ్యాంకర్లు 20 శాతం వరకు కమీషన్‌లు తీసుకున్నట్లు సమాచారం.
ఇంతవరకు రూపాయి తీసుకోలేదు
సాయిబాబ, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, తూనికలు, కొలతల శాఖ
నాకు కలెక్టరెట్‌లోని ట్రెజరీ బ్రాంచీలో ఖాతా ఉంది. ఇంత వరకు నేను జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బ్యాంకుకు నాలుగు సార్లు వచ్చాను. ప్రతిసారి నో క్యాష్ బోర్డు కనిపిస్తోంది. సోమవారం రూ.4000 ప్రకారం ఇస్తున్నారని వచ్చాను.. అ మొత్తం తీసుకుందామంటే టోకన్‌లు అయిపోయినాయని చెప్చారు. ఎన్నాళ్లు ఇలా బ్యాంకులు చుట్టూ తిరగాలి.
Advertisement