మద్యంపై కనిపించని నోట్ల ప్రభావం
తిమ్మాజీపేట: నోట్ల రద్దు తర్వాత నగదు లేక రైతులు, కూలీలు, సామాన్యులు ఇబ్బందులకు గురవుతుంటే మద్యం ఖజానా ఫూల్ అవుతుంది. మద్యంపై నోట్ల రద్దు ప్రభావం ఉంటుందని అంతా భావించినా మద్యంపై మాత్రం నోట్ల రద్దు ఎలాంటి ప్రభావం చూపించలేదు. మండల కేంద్రంలోని ఐఎంఎల్(మద్యం) డిపో నుంచి ప్రతిరోజూ నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలతోపాటు షాద్‌నగర్, కొడంగల్, కల్వకుర్తి నుంచి విడిపోయిన మండలాల నుంచి సైతం మద్యం షాపుల యజమానులు తిమ్మాజీపేట గోదాం నుంచే మద్యాన్ని తీసుకెళ్తారు. ఇక్కడి నుంచే పూర్వ జిల్లా వ్యాప్తంగా మద్యం సరఫరా అవుతుంది.
ప్రతినెలా వచ్చే ఆదాయం కన్నా నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది. ప్రతినెలా రూ.70 నుంచి రూ.80కోట్ల మధ్య మద్యం విక్రయాలు సాగుతున్నాయి. నోట్లు రద్దయిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.160 కోట్ల విక్రయాలు జరిగాయి. రూ.15నుంచి రూ.20 కోట్ల ఆదాయం పెరిగింది. నోట్లు రద్దయ్యాక మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించినట్లయింది.