ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని, లేకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ మాదిగ హెచ్చరించారు.
భిక్కనూరు: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని, లేకపోతే తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ మాదిగ హెచ్చరించారు. జూలై 18న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక నుంచి ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ పాదయాత్ర ఆదివారం భిక్కనూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా రమేశ్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారం రాగానే మరోమాట మాట్లాడడం సర్వసాధారణంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్గీకరణ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, ఉపాధ్యక్షుడు శంకర్, మండల అధ్యక్షుడు పెంటయ్య సాగర్ పాల్గొన్నారు.