అనూహ్యంగా తెరమీదికొచ్చిన మరో ఎమ్మెల్యే | on June 15 MP Gutta sukhendar Reddy Join in TRS Party | Sakshi
Sakshi News home page

అనూహ్యంగా తెరమీదికొచ్చిన మరో ఎమ్మెల్యే

Published Mon, Jun 13 2016 8:04 AM | Last Updated on Thu, Aug 9 2018 4:48 PM

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్యే భాస్కరరావు - Sakshi

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్యే భాస్కరరావు

15న గులాబీ గూటికి నల్లగొండ ఎంపీ గుత్తా..
మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, ముఖ్య కాంగ్రెస్ నేతలతో కలిసి
అనూహ్యంగా తెరమీదికొచ్చిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
ఆయన కూడా అదేరోజు అధికార పార్టీలోకి..
ఆదివారం సీఎం కేసీఆర్‌తో ఫాంహౌస్‌లో గుత్తా, భాస్కరరావు భేటీ
అక్కడి నుంచి సీఎం కారులోనే క్యాంపు ఆఫీసుకు
అక్కడ జిల్లా మంత్రితో చర్చల అనంతరం నిర్ణయం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉత్కంఠకు తెర  పడింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ నెల 15న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరనున్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆదివారం మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి సీఎం ఫాంహౌస్‌తో పాటు బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన చర్చల్లో ముహూర్తం ఖరారైంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో పాటు ముఖ్యమైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన బుధవారం గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరుతున్నారన్న వార్తలు వచ్చిన నాటి నుంచి ఎప్పుడెప్పుడు నిర్ణయం జరుగుతుంది? అసలు చేరుతారా లేదా అనే సందేహాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లా రాజకీయ వర్గాల సస్పెన్స్ వీడినట్టయింది.

అయితే, అధికార పార్టీలోనికి చేరే వారిలో ఉన్నట్టుండి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడా తెరమీదకు వచ్చారు. ఆయన కూడా ఈనెల 15నే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
 
ఫాంహౌస్ టూ క్యాంప్ ఆఫీస్
గుత్తా టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై ఆదివారం కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావు, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు మెదక్ జిల్లాలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన అనంతరం ఈనెల 15న గుత్తా, భాస్కరరావులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించారు.

అక్కడి నుంచి హైదరాబాద్‌లోని క్యాంపు ఆఫీసుకు వెళ్లిన సీఎం కేసీఆర్ తన కారులోనే ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కరరావులను కూడా తీసుకెళ్లారు. అక్కడ వీరికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా తోడయ్యారు. నలుగురూ చాలా సేపు చర్చించారు. పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. అయితే, గుత్తా, భాస్కరరావులు పార్టీలో చేరే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాల్సిన అవసరం లేదని, కేవలం జెడ్పీటీసీలు, ఇతర ముఖ్య నేతలను మాత్రమే ఆ వేదికపై పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
పది రోజుల తర్వాత
వాస్తవానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్త ఈనెల 3న వెలుగులోనికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్2న ఆయన సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిలతో హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీ బి. వినోద్‌కుమార్ (కరీంనగర్), రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి , తిప్పర్తి ఎంపీపీ, డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పాశం రాంరెడ్డిలు పాల్గొన్నారు.

ఈ భేటీలోనే గుత్తాను టీఆర్‌ఎస్‌లోనికి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన గుత్తా తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనా మా చేసే అంశంపై సీఎంను స్పష్టత అడిగారు. ఆ అంశంపై తర్వాత... చూద్దాంలే అని చెప్పిన సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన చర్చల్లో ఈ అంశంపై కూడా గుత్తాతో మాట్లాడినట్టు తెలిసింది. అయితే, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతారా లేక చేయకుండానే గులాబీ కండువా కప్పుకుంటారా అనేది మాత్రం స్పష్టం కాలేదు.

ఈ విషయంలో నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా, తొలి నుంచీ తాను టీఆర్‌ఎస్‌లో చేరే అంశాన్ని గుత్తా ఎక్కడా ఖండించలేదు. వార్త బయటకు వచ్చిన రోజు విలేకరులు అడిగినప్పుడు కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేనని, భవిష్యత్ ఏం జరుగుతుందో ఊహించలేమని చెప్పిన గుత్తా ఎక్క డా అధికారికంగా నోరు విప్పలేదు. మి ర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు మాత్రం తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని మరుసటి రోజే ఖండించారు. కానీ, 15న టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.
 
రవీంద్రకుమార్.. రసకందాయం
కాగా, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అనూహ్యంగా సీన్‌లోకి వచ్చారు. ఆయన అధికార టీఆర్‌ఎస్‌లో చేరుతారని గత రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. ఆయన కూడా తాను టీఆర్‌ఎస్‌లో చే రడం లేదని చెప్పారు. కానీ, మళ్లీ మనసు మార్చుకుని అధికార పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయినట్టు తెలిసింది.

ఆదివారం సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చల్లో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ చర్చల్లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ విషయమై వివరణ కోరేందుకు రవీంద్రకుమార్‌కు ‘సాక్షి’ ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. అయితే, అనూహ్యంగా తెరమీదకు వచ్చిన రవీంద్రకుమార్ టీఆర్‌ఎస్‌లో చేరితే దేవరకొండ రాజకీయం రసకందాయంలో పడనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement