పూతలపట్టు ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించకపోవడం ఘోరం
ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
బాధ్యులపై కేసు నమోదు చేయాలంటూ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్
తిరుపతి : పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడం ఘోరమని ఎంపీ మిథున్‌రెడ్డి విస్మయాన్ని వ్యక్తం చేశారు. వీడియో ఆధారాలున్నా పోలీసులు ఇప్పటివరకూ బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం ఎంపీ మిథున్‌రెడ్డి సాక్షితో మాట్లాడుతూ, పోలీసుల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా మారిందన్నారు. మండల సమావేశం సందర్భంగా ఎస్సీ ఎమ్మెల్యేకి అవమానం జరిగిన నేపథ్యంలో స్వయంగా శాసనసభ్యుడు ఫిర్యాదు చేసినా పోలీసులు సంబంధిత అధికారులు, అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం, కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ విషయంలో పోలీసులు స్పందించకపోతే హెచ్‌ఆర్సీకి, ఎస్సీఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం ఖాయమని ఎంపీ హెచ్చరించారు. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అందరితో కలిసి జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇదే విషయంపై జీడీ నెల్లూరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా స్పందించి పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. బాధ్యులపై కేసు నమోదు చేయని పక్షంలో పార్టీ తరపున ఆందోళనలు మొదలు పెడతామన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడం, బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పోలీస్‌స్టేషన్ల ముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు యోచిస్తున్నారు. వచ్చే మంగళవారం కార్యక్రమాలకు రూపకల్పన జరిపి నిరసన కార్యక్రమాలకు కార్యకర్తలను సమీకరించే అవకాశాలున్నాయి. ఎస్సీ ఎమ్మెల్యేపై పోలీసులు చిన్నచూపు చూడడాన్ని పార్టీ నేతలు సహించలేకపోతున్నారు.