ఒక్కరోజు..రూ.4 కోట్లు | one day dead line tax collection 4crores | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు..రూ.4 కోట్లు

Published Thu, Mar 31 2016 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

ఒక్కరోజు..రూ.4 కోట్లు

ఒక్కరోజు..రూ.4 కోట్లు

వంద శాతం పన్నుల వసూళ్లు..
లక్ష్యసాధనకు అధికారుల ఉరుకులు

 ఉన్న గడువు ఒక్కరోజు.. వసూలు కావాల్సిన పన్ను రూ. 4.23 కోట్లు. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.  పన్నుల వసూళ్లలో గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నా.. మిగిలిన ఒక్కరోజులో మిగతా లక్ష్యాన్ని చేరడంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31 వరకు రూ.37.74 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ నెల 30 వరకు రూ.33.51 కోట్లు వసూలయ్యాయి. జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలు ఉండగా, 950 పంచాయతీల నుంచి వంద శాతం వసూలయ్యాయి. పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న మెదక్ జిల్లా.. ఈసారీ ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికారులు చెమటోడుస్తున్నారు.      

జోగిపేట: పన్నుల వసూళ్లలో జిల్లా గత ఏడాది మాదిరిగానే మొదటి స్థానం నిలబెట్టుకుంటుందో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వసూళ్లకు గడవు ఇక ఒక్క రోజు మాత్రమే ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. 2015-16 సంవత్సరానికిగాను రూ. 37.74 కోట్ల పన్నుల వసూలు లక్ష్యంకాగా ఇప్పటి వరకు రూ.33.51 కోట్లు వసూలయ్యాయి. జిల్లాలోని 1077 గ్రామ పంచాయతీలకు గాను 950 పంచాయతీల్లో బుధవారం వరకు 100 శాతం పన్నులు వసూలయ్యాయి. ఈనెల 31వరకు వెయ్యి పంచాయతీలు 100 శాతం ఇంటి పన్నులు వసూలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో  పరిశ్రమలకు సంబంధించిన పన్నులే ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమల ద్వారా రూ.19 కోట్ల పన్నులు రావాల్సి ఉంది. జిల్లాలో 4.50 లక్షల ఇళ్లు ఉన్నాయి.

 కార్యదర్శుల కొరతతో  ఇబ్బందులు
జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 469 మంది  పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు పంచాయతీలకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండటంతో  పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కావడంలేదని సమాచారం. 2013లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరినప్పటికీ పన్నుల వసూలుపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు పర్యవేక్షణలో డివిజనల్ పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వంద శాతం లక్ష్యం పెట్టుకున్నా, కార్యదర్శుల కొరతతో అనుకున్న లక్ష్యం  నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేదు. పంచాయతీల నిర్వహాణ పాలకవర్గానికి కష్టంగా మారుతోంది. మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు.

వారం రోజుల్లో వంద శాతం పన్నులు వసూలు చేస్తాం
ఈనెల 31లోగా జిల్లాలోని అన్ని పం చాయతీల్లో ఇంటి పన్నులను వసూలు చేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం.  అనుకున్న సమయంలో కాకున్నా మరో వారం పాటు జిల్లాలో పన్నుల వసూలు చేస్తాం. ఇప్పటికే 950 పంచాయతీల్లో వంద శాతం వసూళ్లు సాధించాం. రేపటి వరకు వెయ్యి పంచాయతీల్లో వంద శాతం పూర్తవుతుంది.  మరో వారం పాటు వసూళ్లు కొనసాగించి 1077 పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేస్తాం. ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో మన జిల్లానే పన్నుల వసూళ్లలో అగ్ర స్థానంలోనే నిలవడం ఖాయం. జిల్లాలో ఎక్కువగా పరిశ్రమలున్నాయి.

వాటి ద్వారానే రూ.19 కోట్లు వ సూలు కావాల్సి ఉంది. అయితే కొన్ని పంచాయతీల పరిధిలోని ఫ్యాక్టరీలు మూతబడిపోవడం,  జప్తు చేద్దామన్న ఎలాంటి ఆస్తులు లేకపోవడం వల్ల కూడా వంద శాతం పూర్తి కాలేకపోతుంది. సదాశివపేట మండలంలో ఇలాంటి పరిస్థితే ఉంది. పన్నుల వసూళ్లలో మంచి పనతీరును గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయనుంది. దీనికింద రాష్ట్రానికి రూ.105 కోట్లు మంజూరు కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2771 పంచాయతీలు వంద శాతం పన్నుల వసూళ్లు చేయగా అందులో మెదక్ జిల్లాకు చెందిన పంచాయతీలు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. పనితీరు గ్రాంట్ కింద సుమారుగా రూ. 40 కోట్లు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. 2014-15 సంవత్సరంలో చేపట్టిన పన్నుల వసూళ్లకు సంబంధించి పనితీరు గ్రాంట్లు విడుదల చేయనున్నారు.   - సురేష్‌బాబు,  జిల్లా పంచాయతీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement