ట్యూబ్‌లైట్ సరిచేస్తూ వ్యక్తి మృతి
రేగుల్లంక (అవనిగడ్డ) :
ఇంట్లో ట్యూబ్‌లైట్ సరిచేస్తూ ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన రేగుల్లంకలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రేగుల్లంకకు చెందిన ఆరిగ మారయ్య (44) బుధవారం తన ఇంట్లో ట్యూబ్‌లైట్ వెలగకపోవటంతో సరిచేస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మారయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మారయ్య మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.