హెల్మెట్ ధరించినా.. లాభం లేకపోయింది
పశ్చిమ గోదావరి జిల్లా : పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ఐ.పంగిడికి చెందిన శివరామకృష్ణ(33) దేవరపల్లి మండలం గొల్లగూడెం సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సోమవారం నైట్ డ్యూటీకి వెళ్లిన అతను ఉదయం ఆరు గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరాడు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా..
దేచెర్ల ఎర్రచెరువు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. కిందపడిపోయిన అతను లేవబోతుండగా లారీ టైర్లు తలపై నుంచి వెళ్లడంతో తలభాగం నుజ్జునుజ్జయింది. అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటనా ప్రదేశంలో మృతదేహం పడి ఉన్న తీరు స్థానికులను కలచివేసింది. మృతిడికి భార్య పార్వతితోపాటు 9నెలల బాబు కూడా ఉన్నాడు. అతనికి పెళ్లై రెండేళ్లయింది. తండ్రి వెంకట్రావు వికలాంగుడు. తల్లి ఉషారాణి గృహిణి. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో వారు విలవిలలాడిపోతున్నారు. భార్య పార్వతి తీవ్రంగా రోదిస్తోంది.
హెల్మెట్ ఉన్నా..
శివరామకృష్ణ హెల్మెట్ ధరించినా.. లాభం లేకపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ఊడిపోయింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద స్థలం దేవరపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఎస్‌ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.