ఆటో బోల్తా :వ్యక్తి మృతి
-
మృతదేహాన్ని అడవిలో పడేసిన ఆటోడ్రైవర్
చిలమనూరు (బాలాయపల్లి) : వెంకటగిరి–నాయుడుపేట రోడ్డులో చిలమనూరు తిప్ప మలుపు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఆటో బోల్తాపడి అదే గ్రామానికి చెందిన బత్తల మహేశ్వరయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆటోడ్రైవర్ ఆతను స్నేహితుడు కలిసి అడవిలోకి వెళ్తున్న కాలి దారిలో పడేసి వెళ్లారు. పోలీసులు కథనం మేరకు శుక్రవారం ఉదయం మహేశ్వరయ్య వెంకటగిరికి వెళ్లాడు రాత్రి 10 గంటలకు వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిలమనూరుకు చెందిన మోడి కృష్ణయ్య ఆటోలో ఎక్కాడు. చిలమనూరు సమీపంలో తిప్ప మలుపు వద్ద ఆటో బోల్తాపడి మహేశ్వరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోడ్రైవర్ కృష్ణయ్య, అతని స్నేహితుడు కలిసి మృతదేహాన్ని ఆడవిలో పడేసి వెళ్లిపోయారు. మహేశ్వరయ్య శుక్రవారం రాత్రి ఇంటికి రాకపోవడంతో అనారోగ్యంతో మంచంలో ఉన్న భార్య ఆదెమ్మ బంధువులకు తెలపడంతో బంధువులు ఆటోడ్రైవర్ కృష్ణయ్యను అడిగారు. అతను తన ఆటోలో ఎక్కలేదని చెప్పాడు. దీంతో వెంకటగిరిలో ఉన్న బంధువులను విచారించగా శుక్రవారం రాత్రి 10 గంటలకు కృష్ణయ్య ఆటోలో బయలు దేరి వచ్చాడని చెప్పారు. అప్పటికే పశువుల కాపరులు మహేశ్వరయ్య మృతదేహం అడవిలో ఉందని సమాచారం ఇవ్వడంతో పోలీసులకు తెలిసింది. దీంతో వెంకటగిరి ఎస్‌ఐ రహీంరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఆటో డ్రైవర్ కృష్ణయ్యను విచారించాడు. ఆటో బోల్తాపడిం మహేశ్వరయ్య ఆటో కింద పడి మృతి చెందాడని చెప్పాడు.
మానవత్వం కోల్పోయిన ఆటో డ్రైవర్
ఆటో బోల్తాపడి మృతి చెందితే ఆటోడ్రైవర్ ఎవరికి తెలియదులే అనుకుని మహేశ్వరయ్య మృతదేహాన్ని స్నేహితుడు సాయంతో అడవిలో పడేయడంతో గ్రామస్తులు మండిపడ్డారు. ఇక ఆటోను ఎవరికి తెలియకుండా అడవిలో దాచి ఇంటి వద్ద అందరితో కలిసి ఏమి తెలియనట్టు వ్యవహరించడంతో మానత్వం లేకుండా వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.