ఓ వైపు ఆందోళనలు.. మరోవైపు భూసేకరణ
గీసుకొండ, సంగెం మండలాల్లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే, సేకరణ నిరసనల మధ్య కొనసాగుతోంది. రెండు మండలాల్లోని ఊకల్, శాయంపేట హవేలీ, స్టేషన్‌చింతలపెల్లి, రాయనికుంట, కృష్ణానగర్ గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో రెవెన్యూ అధికారుల బృందం భూ సేకరణ ముమ్మరం చేసింది.
-
ఆగని రిజిస్ట్రేషన్లు
-
రేపు రైతు గర్జన పేరిట సభ
గీసుకొండ : గీసుకొండ, సంగెం మండలాల్లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే, సేకరణ నిరసనల మధ్య కొనసాగుతోంది. రెండు మండలాల్లోని ఊకల్, శాయంపేట హవేలీ, స్టేషన్‌చింతలపెల్లి, రాయనికుంట, కృష్ణానగర్ గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో రెవెన్యూ అధికారుల బృందం భూ సేకరణ ముమ్మరం చేసింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 75 ఎకరాలను పట్టాదారులైన రైతుల నుంచి సేకరించి రిజిసే్ట్రషన్లు చేసినట్లు తెలుస్తోంది. రైతుల భూములతోపాటు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కలుపుకుని ఇప్పటివరకు సుమారు 600 ఎకరాలు సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సుమారు 1500 ఎకరాల వరకు భూసేకరణ జరిగే అనుకూల పరిస్థితులు ఉన్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో రైతులు తమ భూములను సేకరించొద్దని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరణ చేయాలని, తమ భూములను బలవంతంగా లాక్కోవద్దంటూ బాధిత గ్రామాల రైతుల భూ పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళన చేశారు. పలు పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నెల 5వ తేదీన రైతు గర్జన పేరుతో వరంగల్ నగరంలో జరిగే సభలో గీసుకొండ, సంగెం మండలాల్లో టెక్స్‌లైట్ పార్కు ఏర్పాటు కోసం చేస్తున్న బలవంతపు భూసేకరణనే ప్రధాన ఎజెండాగా పెట్టారు. ఇదిలా ఉండగా కొందరు రైతులు తమ భూములకు ప్రభుత్వం ఆశించిన రీతిలో ధర ఇచ్చి సేకరిస్తోందంటూ భూములను అప్పగించడానికి ముందుకు వస్తుండడం గమనార్హం. రైతుల భూములకు ఆశించిన రీతిలో పరిహారం చెల్లించి సేకరించడానికి ప్రభుత్వం ముందుకు రావడానికి తాము చేస్తున్న ఆందోళనలే ప్రధాన కారణమని, ఇది ఒక రకంగా రైతులు సాధించిన విజయమని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.