టెక్స్‌టైల్ పార్కు భూసేకరణకు కొత్త సమస్య
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో టెక్స్‌టైల్ పార్కు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 7న రాష్ట్ర పర్యటకు వస్తున్న నేపథ్యంలో అదేరోజు టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు టెక్స్‌టైల్ పార్కుకు అవసరమైన భూముల సేకరణలో ఇబ్బందులు మొదలవుతున్నాయి.
-
మూడు వేల ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు
-
ప్రైవేట్ పట్టాభూములు 1200 ఎకరాలు
-
ఆగస్టు 7న ప్రధాని మోడీ శంకుస్థాపన!
-
భూములు ఇవ్వబోమంటున్న కొందరు రైతులు
-
2013 చట్టం అమలుకు మరికొందరి డిమాండ్
సాక్షిప్రతినిధి, వరంగల్ :
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో టెక్స్‌టైల్ పార్కు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 7న రాష్ట్ర పర్యటకు వస్తున్న నేపథ్యంలో అదేరోజు టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు టెక్స్‌టైల్ పార్కుకు అవసరమైన భూముల సేకరణలో ఇబ్బందులు మొదలవుతున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కొందరు రైతులు పట్టుబడుతున్నారు. మరికొందరు మాత్రం తమ భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉండడంతో టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి ఇబ్బందులు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటను ఉంటుందనే సమాచారం నేపథ్యంలో ఇప్పుడు టెక్స్‌టైల్ పార్కు భూసేకరణ సమస్యల అంశం తెరపైకి వస్తోంది.
తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పత్తి పంట ఉత్పత్తుల ఆధారంగా భారీ స్థాయిలో వస్త్ర, అనుబంధ పరిశ్రమ సముదాయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెక్స్‌టైల్ పార్కు పేరుతో వరంగల్ జిల్లాలో దీన్ని స్థాపించాలని నిర్ణయించింది. వరంగల్ నగరానికి 20 కిలో మీటర్ల దూరంలో మూడు వేల ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం గ్రామాల్లోని భూములు టెక్స్‌టైల్ పార్కు నిర్మాణానికి అనువైనవిగా గుర్తించారు. టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం కోసం మూడు వేల ఎకరాల భూములు అవసరమవుతాయని అంచనా వేశారు. దేవునూరు, ముప్పారం గ్రామాల పరిధిలో 1016.33 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరో 1328.13 ఎకరాల ప్రైవేటు పట్టా భూములను సేకరించాలని నిర్ణయించారు. మొదటి దశలో రెండు గ్రామాల పరిధిలోని 279.35 ఎకరాల సాగు భూముల సేకరణ కోసం ఈ నెల 20న రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 123 జీవో ప్రకారం భూసేకరణ జరుపుతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో అభ్యంతరాలను తెలపాలని... అభ్యంతరాలు రాకుంటే అందరూ సమ్మతించినట్లుగా భావిస్తామని సూచించారు. అభ్యంతరాల గడువు దగ్గరపడుతుండడంతో రెండు గ్రామాల్లోని కొందరు రైతులు భూములు ఇవ్వబోమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2013 చట్టం ప్రకారం మెరుగైన ప్యాకేజీ ఇస్తేనే భూములు ఇస్తామని కొందరు అంటున్నారు.
భూమిని ఇచ్చేది లేదు
ప్రభుత్వం ఎంత నష్టపరిహారం చెల్లించినా నాకున్న వ్యవసాయ భూమి అప్పగించేది లేదు. ప్రభుత్వ భూమిలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. టెక్స్‌టైల్ పార్క్ కోసం ప్రభుత్వం గుర్తించిన భూములు బలవంతంగా అయినా తీసుకుంటుందని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అప్పగించాలని రెవిన్యూ అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
– మర్రిపెల్లి ఎల్లయ్య, రైతు ముప్పారం
వ్యతిరేకం కాదు
టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు. ముప్పారం, దేవునూరు శివారులో ఉన్న ప్రభుత్వ భూమిలో టెక్స్‌టైల్ పార్క్‌ను నిర్మించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మా భూములు తీసుకోవాలని నిర్ణయిస్తే... 2013 చట్టం ప్రకారం న ష్టపరిహారం అందించాలి. అధికారులు మాతో సమావేశాలు నిర్వహించనప్పుడు భూసేకరణ చట్టం–2013, జీవో 123 మధ్య లాభనష్టాల్లో తేడాలను వివరించలేదు. ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
– కుడుతాజీ రవీందర్, రైతు ముప్పారం