
‘ఉల్లి’ కల్లోలం.. ఆపండి
♦ అధికారులూ కల్లాల్లోకి వెళ్లండి
♦ ఉల్లి రైతుకు అండగా నిలబడదాం
♦ కిలో రూ.12కు విక్రయించే ఏర్పాట్లు చేయండి
♦ మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
♦ ‘సాక్షి’ కథనానికి స్పందన
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దిగుబడి పెరిగి, మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న ఉల్లిగడ్డ రైతులకు అండగా నిలబడదామంటూ భారీ నీటిపారుద ల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. క్వింటాలు ఉల్లికి కనీసం రూ.1200 గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులను ఆదేశించారు. ఉల్లి రైతు కష్టాన్ని దళారులు దోచుకుంటున్న తీరును వివరిస్తూ ‘కన్నీళ్లు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందించారు. చేతికి అందిన పంట దళారుల పాలుకాకుండ చూసే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేనని మంత్రి గుర్తుచేశారు.
కల్లాల్లోకి వెళ్లి పంట దళారులకు అమ్ముకోకుండా చూడాలన్నారు. వ్యవసాయ మార్కెట్లలో ప్రస్తుతం పనులు పెద్దగా లేనందున సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోని మార్కెటింగ్ శాఖ సిబ్బందిని కూడా డిప్యూటేషన్‌పై నారాయణఖేడ్ నియోజకవర్గానికే పంపించాలని సూచించారు. రైతులు పంటను నేరుగా రైతు బజారుకు తరలించి, కిలోకు కనీస మద్దతు ధర రూ.12 కు అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు అవసరమైతే పల్లె వెలుగు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటుచేయాలని నారాయణఖేడ్ డిపో మేనేజర్‌ను ఆదేశించారు.