‘మద్దతు’ పైసా తగ్గినా ఊరుకోం
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు పైసా తగ్గినా వెంటనే కొనుగోలు చేయడానికి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను సిద్ధం చేశామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఎంఎస్‌పీకి పైసా తగ్గకుండా రైతులకు ఇప్పిస్తున్నామని చెప్పారు. మొక్కజొన్నను మార్క్‌ఫెడ్, ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ, పత్తిని కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొక్కజొన్న క్వింటాలు ఎంఎస్‌పీ రూ.1,365 కాగా.. వ్యవసాయ మార్కెట్లలో రూ.1,400 నుంచి రూ.1,450 వరకు రైతుకు లభిస్తున్నట్లు వివరించారు.
పత్తి ఎంఎస్‌పీ రూ. 4,160 ఉండగా.. రూ. 4,800 నుంచి రూ. 5,100 వరకు వస్తోందన్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన విమర్శలు అర్థరహితమన్న మంత్రి.. బీజేపీ నేతలు గుడ్డి వాళ్లని విమర్శించారు. ‘నామ్’ అమలులో వైఫల్యానికి కేంద్రానిదే పూర్తి బాధ్యతన్నారు. నామ్‌కు సంబంధించిన సర్వర్, సాఫ్ట్‌వేర్ ఇతర సాంకేతిక వ్యవహారాలు నాగార్జున ఫర్టిలైజర్స్ కంపెనీకి అప్పగించారన్నారు.
సాఫ్ట్‌వేర్, సర్వర్ సమస్యలతో ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ తదితర వ్యవసాయ మార్కెట్లలో ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయంపై వారం కిందటే నామ్ ప్రతినిధులతో చర్చించానన్నారు. ఖరీఫ్ దిగుబడులు వస్తున్నందున ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో సమస్యలు పరిష్కరించాలని వారిని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. నామ్‌లో భాగంగా దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే ఎక్కువ ఆన్‌లైన్ ట్రేడింగ్ జరిగినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు.
కలెక్టర్లతో పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్
క్షేత్రస్థాయి కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలపై సూచనలిచ్చారు. 27.52 లక్షల పత్తి రైతులకు బార్‌కోడ్ కార్డులు మంజూరు చేశామని, తద్వారా వారికి ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరుగుతాయన్నారు.
అక్టోబర్‌లో మొక్కజొన్న,సోయాబీన్.. నవంబర్‌లో వరి, పత్తి, కందులు మార్కెట్‌కు చేరతాయని, ఈ ఏడాది 195 మొక్కజొన్న, 1,900 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిందన్నారు. సోయాబీన్ ఏ గ్రేడ్‌కి క్వింటాలుకు రూ.2,775, బీ గ్రేడ్‌కు రూ.2,400, వరి సాధారణ రకం రూ.1,470, ఏ గ్రేడ్‌కు రూ.1,510, మొక్కజొన్న రూ.1,365 మద్దతు ధర నిర్ణయించామన్నారు. వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్, మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.