వృద్ధురాలికి 'ఆన్‌లైన్' బురిడీ!
ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట మండలంలోని చెంచుగారిపల్లె దళితవాడకు చెందిన యాగల లక్ష్మీనరసమ్మ కూలి పని చేసుకొని జీవిస్తోంది. ఆమె భర్త 20 ఏళ్ల క్రితం మరణించారు. వితంతు పింఛన్ తీసుకుంటోంది. తనకు ఎవరూ లేకపోవడంతో పెన్షన్, కూలి పని చేసుకుని సంపాదించుకున్న మొత్తాన్ని ఒంటిమిట్ట స్టేట్‌బ్యాంకులో నంబర్: (11524745925)తో 2007లో ఖాతా ఓపెన్ చేయించుకుంది. అప్పటి నుంచి ఖాతాలో కొంత నగదుతోపాటు, భర్త ద్వారా సంక్రమించిన భూమిని విక్రయించగా వచ్చిన రూ.50 వేల నగదును అకౌంట్‌లో వేసుకుంది. 2015 నాటికి రూ.99,928 నిల్వకు చేరుకుంది. 2016లో బ్యాంక్‌కు వెళ్లి రూ.20 వేలు డ్రా చేసుకుంది. తర్వాత అకౌంట్ పుస్తకంలో కంప్యూటర్ ద్వారా నగదు వివరాలను ఎక్కించుకుంది. రూ.19,909 మాత్రమే నిల్వ ఉన్నట్లు చూపడంతో వృద్ధురాలిలో ఆందోళన మొదలైంది. మిగతా డబ్బు గురించి బ్యాంక్ అధికారులను అడగ్గా తమకు తెలియదని చెప్పడంతో ఏమీ చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆన్‌లైన్‌లో ఎవరో ట్రాన్స్‌క‌్షన్ చేసుకొని ఉంటారని బ్యాంకు అధికారులు ఉచిత సలహా ఇచ్చేశారు.
ఏడు దఫాలుగా డ్రా..
తన అకౌంట్ నుంచి ఏడు దఫాలుగా రూ.63 వేలను ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లుగా వివరాలు తెలుసుకోగలిగింది. కాగా వృద్ధురాలికి గ్యాస్ కనెక‌్షన్ ఉంది. గ్యాస్ సిలిండర్ కోసం డబ్బు చెల్లించిన తర్వాత సబ్సిడీ కోసం ఆధార్‌కార్డును చిన్నకొత్తపల్లెకు చెందిన ఓ వ్యక్తి ఇప్పించుకుని, వేలిముద్ర వేయించుకునే వాడు. అతనిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో కూడా ఇదే విధంగా వేరే వారికి చేస్తే.. వారు నిలదీస్తే డబ్బులు తిరిగి ఇచ్చేశాడనే ఆరోపణలు ఉన్నాయని ఆమె చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదని విలేకర్ల వద్ద వాపోయింది. దళిత వృద్ధురాలికి కనీసం దళితనాయకులు అండగా నిలిచి.. ఆమెను ఆన్‌లైన్ ద్వారా మోసం చేసి నగదు తస్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
బ్యాంక్ మేనేజర్ ఏమంటున్నారంటే..
లక్ష్మీనరసమ్మ అకౌంట్‌లో నగదు గల్లంతు విషయంతో తనకు సంబంధం లేదని ఒంటిమిట్ట ఎస్‌బీఐ మేనేజర్ వెంకట్రావు తెలిపారు. ఆన్‌లైన్‌లో నగదు ట్రాన్స్‌క‌్షన్ జరిగి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.