వదంతులు మాత్రమే
– అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు
– పాతబస్తీలో పర్యటించి వ్యాపారులకు ఎస్పీ హెచ్చరిక
కర్నూలు : ఉప్పు కొరత వదంతులు మాత్రమేనని, వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఉప్పు కొరత నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయంటూ టీవీ ప్రసారాల నేపథ్యంలో శనివారం రాత్రి ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు నగరంలోని పాతబస్తీలో పర్యటించారు. కర్నూలు నగరం కప్పల్‌నగర్, పూలబజార్, గార్గేయపురం, మండిబజార్ ప్రాంతాల్లో ఈ వదంతులు పాకడంతో ఉప్పును కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున షాపుల ముందు క్యూ కట్టారు. ఇదే విషయాన్ని కొంతమంది ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పూలబజార్ దగ్గర చెన్నకేశవ స్టోర్స్, భాగ్యలక్ష్మీ స్టోర్స్, అయ్యప్ప జనరల్ స్టోర్స్, న్యూ లక్ష్మీ నారాయణ ట్రేడర్స్‌తో పాటు మరికొన్ని కిరాణ షాపుల వద్దకు వెళ్లి ఉప్పు ప్యాకెట్లను ఎంఆర్‌పీకే అమ్మాలని వ్యాపారులకు సూచించారు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూలబజార్‌లోని పలు కిరాణం స్టోర్లను సందర్శించి ఉప్పుపై వెలువడిన వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉప్పు రేటు పెంచి పుకార్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.1000, రూ.500 నోట్ల మార్పిడికి బ్యాంకుల దగ్గర కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తినా డయల్ 100, 112కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఒకటోపట్టణ సీఐ కృష్ణయ్య తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.