‘ఉప్పు’తిప్పలు | salt problems | Sakshi
Sakshi News home page

‘ఉప్పు’తిప్పలు

Published Sat, Nov 12 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

‘ఉప్పు’తిప్పలు

‘ఉప్పు’తిప్పలు

– ధర పెరిగిందంటూ వదంతలు
– దుకాణాలకు క్యూ కట్టిన ప్రజలు
 – పోలీస్‌ బందోబస్తు కోరిన వ్యాపారులు
 – పెద్దనోట్ల రద్దుతో ఉప్పు రవాణాలో ఇబ్బందులు
 
 నంద్యాల/ఎమ్మిగనూరు/ కోడుమూరు రూరల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో..ఎలా వచ్చిందో తెలియదుకాని ఉప్పు ధర భారీగా పెరుగుతోందన్న పుకారు శనివారం ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. పుకార్ల దెబ్బకు కిరాణ దుకాణాలు కిటకిటలాడాయి. జనతాకిడిని తట్టుకోలేక కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేసి.. పోలీసులను ఆశ్రయించారు. ధరలు పెరగలేదని.. వదంతులను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేసిన వందంతుల ప్రభావం శనివారం రాత్రి వరకు తగ్గలేదు. 
తమిళనాడులోని టూట్‌కార్‌ నుంచి నంద్యాలకు లారీల్లో ఉప్పు సరఫరా అవుతుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి పది టన్నులను దిగుమతి చేసుకొంటారు. వీటితో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీలకు చెందిన అయోడైజ్డ్‌ ప్యాకెట్లను కూడా వ్యాపారులు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం కేజీ రూ.6 నుంచి రూ.7కు విక్రయిస్తున్నారు. కేజీ అయోడైజ్డ్‌ ప్యాకెట్‌ను హోల్‌సెల్‌ షాప్‌లో రూ.11కు రిటైల్‌ షాప్‌లో రూ.17కు విక్రయిస్తున్నారు. 
రవాణాలో అంతరాయం...
ఉప్పు దిగుమతి చేసుకోవడానికి రవాణాలో అంతరాయం ఏర్పడింది. తమిళనాడులోని టూట్‌కార్‌ నుంచి లారీల్లో దిగుమతి చేసుకోవడానికి నోట్ల కొరత ఇబ్బంది ఏర్పడింది. ట్రాన్స్‌పోర్టు సిబ్బంది పాత నోట్లు రూ.1000, రూ.500 తీసుకోవడానికి నిరాకరించి, కేవలం రూ.100 నోట్లు మాత్రమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే రూ.100 నోట్ల కొరత ఉండటం, కొత్త రూ.500, రూ.2వేల నోట్లు చేతికి అందకపోవడంతో ఉప్పు వ్యాపారులు సకాలంలో దిగుమతి చేసుకోలేకపోయారు. దీంతో ఉప్పుకు కొంత డిమాండ్‌ వచ్చింది. 
షాపుల వద్ద క్యూకట్టిన స్థానికులు..
ఉప్పు ధర పెరిగిపోతుందని, కేజీ రూ.150 వరకు విక్రయించే అవకాశం ఉందని వతంతులు వచ్చాయి. దీంతో ఉప్పును భారీ మొత్తంలో కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకోవడానికి స్థానికులు గాంధీచౌక్, పప్పులబట్టి, మార్కెట్‌ ప్రాంతాల్లో ఉన్న హోల్‌సెల్‌ షాపుల వద్ద ఎగబడ్డారు. జనం అధికంగా రావడంతో వారిని నియంత్రించలేక వ్యాపారులు.. పోలీసులను ఆశ్రయించారు. తమకు బందోబస్తును కల్పిస్తే, మామూలు ధరకే విక్రయిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు వారికి బందోబస్తును కల్పించారు. 
రూ.50కిపైగా విక్రయం...
ఉప్పు కొరత ఏర్పడుతుందని వచ్చిన డిమాండ్‌ను కొందరు రిటైల్‌ వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. రూ.7కు విక్రయించే ముడి ఉప్పును రూ.20, అయోడైజ్డ్‌ ప్యాకెట్లను రూ.50 వరకు విక్రయించారు. అయినా స్థానికులు ఒక్కొక్కరు 10 నుంచి 20కేజీల వరకు కొనుగోలు చేశారు. 
సొమ్ము చేసుకున్న వ్యాపారులు..
ఎమ్మిగనూరు పట్టణంలోని శకుంతల సర్కిల్‌లోని కిరాణా దుకాణాల్లో రాళ్ల ఉప్పును కేజి రూ. 40 ప్రకారం, సన్న ఉప్పును రూ. 50 చొప్పున విక్రయించారు. కొందరు 80 శాతం అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొంతమంది ఉప్పు దొరకదేమోననే ఆందోళనతో షాపులముందు ఉన్న ఉప్పుసంచులతో పరుగు లగించారు. కూలి చేసుకోలేక పూట గడవడమే కష్టంగా ఉంటే బ్యాంకుల చుట్టూ, ఉప్పు కోసం దుకాణాల చుట్టూ తిరగడమేమిటని సామాన్యులు నిట్టూర్పు విడిచారు. 
 
నిజం లేదు..
 కోడుమూరులో భారీస్థాయిలో ఉప్పును కొనుగోలు చేశారు. జనాలు ఎగబడుతుండడంతో కొందరు వ్యాపారులు కిలో ఉప్పు ధరను రూ.5 నుంచి రూ.40కు, ప్యాకెట్‌ ధరను రూ.15 నుంచి రూ.50కు పెంచి అమ్మారు. ఉప్పు ధర పెరుగుతోందని వస్తున్న పుకార్లలో నిజం లేదని, ఎన్ని సంచుల ఉప్పు కావాలంటే అన్ని సంచుల ఇస్తామని  హోల్‌సెల్‌ వ్యాపారస్తులు ప్రకటించారు. 
 
అందరూ చెబుతుంటే... బాలమద్ది, కోడుమూరు
ఉప్పు ధర పెరుగుతోందంటూ జనాలంతా అంగళ్లకు పరుగులు తీస్తున్నారు. ఎందుకైనా మంచిదని నేను కూడా రెండు సంచుల ఉప్పు ప్యాకెట్లను తీసుకెళుతున్నా. 
 
ధర పెరగదు: మల్లికార్జునశెట్టి, కార్యదర్శి, రిటైల్‌ మర్చెంట్స్‌ అసోసియేషన్‌, నంద్యాల
ఉప్పుపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఉప్పు అపారంగా ఉంది. యథావి«ధిగానే దిగుమతి అవుతుంది. కేవలం నోట్ల కొరత వల్లనే కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.  
 
మా దృష్టికి రాలేదు: వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు తహశీల్దార్‌
కేజి ఉప్పును రూ. 50లకు కిరాణా వ్యాపారులు విక్రయిస్తున్నట్లు  మా దృష్టికి రాలేదు. ప్రజలు ఫిర్యాదు చేస్తే వ్యాపారులను సమావేశ పరచి ధరల అదుపునకు చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement