ప్రజాప్రతినిధుల పాత్ర తక్కువే..
హరితహారానికి హాజరు అంతంత మాత్రమే శనివారం పాల్గొన్నది
ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీనే
స్థానిక ప్రజాప్రతినిధులూ కొందరే..
రోజువారీగా ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు. మంత్రుల నుంచి సర్పంచ్‌ల వరకు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఈ నెల 8న మొదలైన హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తిగా భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం సైతం ఇదే చెబుతోంది. అధికారులు, సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధుల పనితీరుకు హరితహా రం నిర్వహణను కొలనమానంగా తీసుకుంటోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహా రంలో పాల్గొనేందుకు ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపడం లేదు. హరితహారం కార్యక్రమంపై రోజువారీ నివేదికను జిల్లా కలెక్టర్... రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తున్నారు.
ఈ నివేదిక ప్రకారం హరితహా రం కింద జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. శుక్రవారం వరకు 86,40,537 మొక్కల ను నాటగా శనివారం జిల్లా వ్యాప్తంగా 6,83,396 మొక్కలను నాటారు. హరితహారం మొదలైనప్పటి నుంచి శని వారం వరకు జిల్లాలో మొత్తం 93,23,933 మొక్కలను నాటినట్లు నివేదికలో పేర్కొన్నారు. 398 గ్రామాల్లో వంద శాతం లక్ష్యం పూర్తయింది. వీటిలో ఎంపీడీఓల ఆధ్వర్యం లో లక్ష్యం పూర్తయిన గ్రామాలు 238 ఉన్నారుు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో పూర్తయినవి 160 ఉన్నాయి. శనివారం జరిగిన హరితహారం కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా 16 మంది జెడ్పీటీసీ సభ్యులు, 16 మంది మండల పరిషత్ అధ్యక్షులు, 24 మంది ఎంపీటీసీ సభ్యులు, 32 మంది సర్పంచ్‌లు శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే హరితహారంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.