పోరాడితే మరోరకంగా ఫలితాలు: సీఎం
* ప్రతిపక్షాలు చెప్పినట్టు చేస్తే.. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లవుతుంది
* ఇక్కడ ఆందోళన చేసే విపక్షాలు అదేదో ఢిల్లీలో చేయాలి
* కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తెస్తే సంతోషిస్తా..
* కర్నూలు జిల్లా కురవళ్లి సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
సాక్షి, కర్నూలు, సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు చెప్పినట్టుగా తాము కేంద్రప్రభుత్వంపై పోరాడితే.. తమ మంత్రులు రాజీనామా చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్టుగా చేస్తే కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్టుగా రాష్ట్రం పరిస్థితి తయారవుతుందన్నారు.
నీరు-చెట్టు పథకం పనుల పరిశీలనలో భాగంగా శనివారం మధ్యాహ్నం సీఎం కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కురవళ్లి గ్రామంలో పర్యటించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని తాను అడుగుతూనే ఉన్నానని చెప్పారు. హోదా విషయంలో తాను రాజీపడుతున్నట్టుగా ప్రతిపక్షాలు విమర్శించడాన్ని తప్పుపట్టారు. హోదాకోసం రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు అదేదో ఢిల్లీలో చేపట్టాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి డబ్బులు తెస్తే సంతోషిస్తామన్నారు. తాను ఎన్నడూ రాజీపడనని, సమస్యలపై పోరాడుతానని చెప్పుకొచ్చారు. ‘‘ప్రత్యేక హోదా విషయంలో నా తప్పు ఏమన్నా ఉందా తమ్ముళ్లూ? కేంద్రాన్ని హోదా విషయంలో అడుగుతున్నానా? లేదా? తమ్ముళ్లూ.. నా తప్పు లేదనుకుంటే చేతులెత్తండి’’ అంటూ కోరారు.
అక్కడ మాట్లాడకుండా ఇక్కడ విమర్శిస్తారా?
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడితే ఏమీ మాట్లాడని వైఎస్సార్‌సీపీ నేతలు ఇక్కడ మాత్రం తనను విమర్శిస్తున్నారని చంద్రబా బు మండిపడ్డారు.అనంతరం ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు రూపొందించిన ‘మనం-మన గ్రామాభివృద్ధి’ పట్టికను ఆవిష్కరించారు.
నేను కాబట్టే రుణమాఫీ చేశా
ఇదిలా ఉండగా వైఎస్సార్ జిల్లా కడపలో ఉద్యాన పంటల రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో సీఎం మాట్లాడుతూ.. ‘‘విభజన చట్టంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కట్టుబట్టలతో వచ్చాం. తెలంగాణ కంటే 11 శాతం మేరకు ఆదాయం తక్కువ.. జనాభా ఎక్కువ. ఇతర రాష్ట్రాలకంటే రూ.35 వేల మేరకు తలసరి ఆదాయం తక్కువ. ఈ పరిస్థితుల్లో రైతులకు రుణవిముక్తి కల్పించాలని నిర్ణయించాం. వేరేవారైతే రుణమాఫీ చేయలేరు. కష్టపడి రుణమాఫీ చేశాం’ అని చెప్పుకొచ్చారు. ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టుల ఏర్పాటుపై అభ్యంతరం తెలిపామని, ఈక్రమంలోనే తెలంగాణ ప్రాజెక్టులకు సైతం అభ్యంతరం చెప్పినట్లు వివరించారు.
నేడు విదేశాలకు వెళ్లనున్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15న ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇప్పటికే లోకేశ్, ఇతర కుటుంబసభ్యులు థాయ్‌లాండ్ వెళ్లారు. సీఎం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలసి స్విట్జర్లాండ్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత పర్యటన అని సమాచారం. సీఎం ఆదివారం తెలుగుదేశం మహానాడు తీర్మానాల కమిటీతో సమావేశమవుతారు.