మా మంచి మాస్టారు | our good sir | Sakshi
Sakshi News home page

మా మంచి మాస్టారు

Published Sun, Sep 4 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

మా మంచి మాస్టారు

మా మంచి మాస్టారు

  • ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తున్న వేణు    
  • అంకితభావంతో విద్యార్థులకు బోధన
  • జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపిక      
  • రేపు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరణ
  •  ఆత్మకూరు  : సమాజంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది. అందు కే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల తర్వాత గురు వులనే పూజిస్తుంటారు. అయితే ఇలాంటి వృత్తినే ఎన్నుకున్న ఓ వ్యక్తి చిత్తశుద్ధితో పనిచేస్తూ పేరు సంపాదిస్తున్నారు. మండలంలోని పులుకుర్తి జెడ్పీ పాఠశాలలో జీవశాస్త్రం స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పరికిపండ్ల వేణు విద్యా, సాంస్కృతి క, సామాజిక సే వలందిస్తూ తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బోధనలకే పరిమితం కాకుం డా విద్యార్థుల్లో నైతిక పాఠాలు చెబుతున్నారు.
    నాన్న స్ఫూర్తితో టీచర్‌గా..
    హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన పరికిపండ్ల కన్నయ్య, పుష్పలీల దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు వేణు చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరి చేవారు. తండ్రి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడంతో తాను కూడా అందులో రాణించాలని వేణు కలలుగని ఆ దిశగా విద్యనభ్యసించారు. కాగా, వేణు భార్య సుమలత, మామయ్య వెల్దండి రమణయ్య, ఇద్దరు మరదళ్లు మాధవి, శుభ, చిన్న బావ కూడా ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వేణు తండ్రి కన్నయ్య ఖమ్మం జిల్లా కమలాపూర్‌ పాఠశాలలో 20 ఏళ్లు ఏకకాలంగా పనిచేసి అక్కడి అధికారులు, ప్రజల మన్నలను పొందారు. అలాగే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
    1987లో ఉద్యోగం..
    వర్ధన్నపేట మండలం భవానీకుంట ప్రాథమిక పాఠశాలలో 1987 ఆగస్టు 29న వేణు ఎస్‌జీటీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఆయన పనిచేస్తున్న బడిలో విద్యార్థులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై‡వేరే పాఠశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో వేణు అధికారులకు నచ్చజెప్పి, గ్రామంలోని ప్రజలను చైతన్యపరిచి విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. అలాగే భవానీకుంట తండా పెద్దతో మాట్లాడి పాఠశాల సొంత భవనం నిర్మాణానికి స్థలం ఇప్పించారు. తర్వాత గదుల నిర్మాణానికి కూడా కృషిచేశారు. అనంతరం ఆత్మకూరు మండలం ల్యాదల్లలో 1998 నుంచి 2001 వరకు, పెంచికల పేటలో 2001 నుంచి 2009 వరకు, పులుకుర్తిలో 2009 నుంచి పనిచేస్తున్నారు. అయితే వేణు ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడి విద్యార్థులకు మెరుగైన బోధనలు అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నారు. 
    సామాజిక కార్యకర్తగా...
    విద్యార్థులకు ఓ వైపు బోధనలు అందిస్తూనే మరోవైపు సామాజిక కార్యకర్తగా హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే జనవిజ్ఞానవేదిక సభ్యుడిగా మూఢనమ్మకాలపై చైతన్య పరుస్తున్నారు. తాను నివాసముంటున్న హన్మకొండలోని ఆదర్శకాలనీ కమిటీ సెక్రటరీగా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నారు.
    కలాం సైన్స్‌ క్లబ్‌ ఏర్పాటు..
    విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి కలిగించేందుకుS2004లో కలాం సైన్స్‌క్లబ్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాను ఏ పాఠశాలలో పనిచేస్తున్న అక్కడి విద్యార్థులకు క్లబ్‌ ద్వారా సేవలు అందిస్తున్నారు. అలాగే ఎన్నో వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆకాశవాణి వరంగల్‌ కేంద్రం ద్వారా ‘చిన్నారిలోకం’ కార్యక్రమానికి విద్యార్థులను పంపించి ప్రసారాలు చేయించారు. దీంతోపాటు జాతీయ బాలలసైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రతిభ కనబరిచేందుకు కృషి చేస్తున్నారు. కలాం సైన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకుగాను ‘విజ్ఞాన్‌ ప్రసార్‌ విప్‌నెట్‌’ సభ్యత్వం దక్కింది. ఈ క్రమంలో విప్‌నెట్‌ ఆహ్వానం మేరకు 2014లో శ్రీహరి కోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో వేణు ‘మోడల్‌æరాకెట్‌’ను తయారు చేసి అధికారుల మన్ననలు పొందారు. ఆయన శిక్షణలో పలువురు విద్యార్థులు రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సీట్లు పొందారు. మరికొందరు నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు.
    సెలవు లేకుండా బడికి
    ఉపాధ్యాయ వృత్తితోపాటు వేణు సామాజిక రచయితగా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆకాశవాణి వరంగల్‌ కేంద్రంగా స్వయంగా ప్రసారాలు చేశారు. తాను సొంతంగా రచనలు చేయడమే కాకుండా విద్యార్థులకు పఠనం, స్వీయ రచనలను అలవాటుగా మార్చుతున్నారు. సైన్స్, ఆరోగ్యం, ప్రకృతి, పర్యావరణం, తదితరSఅంశాల్లో విద్యార్థులతో స్వీయ రచనలు చేయిస్తూ ‘వేకువ’ బాలలసైన్స్‌’ మాసపత్రికను నిర్వహిస్తున్నారు. కాగా, 2014–15 విద్యా సంవత్సరంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా బడికి వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు.
    ఎన్నో అవార్డులు
    విద్యార్థులకు మెరుగైన బోధనలు అందిస్తూ, అంకితభావంతో పనిచేస్తున్నందుకు వేణుకు 2003లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది.  2008లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఇదే ఏడాదిలో ఇందిరా ప్రియదర్శిని, ఉత్తమ ఎన్యూమరేటర్‌ అవార్డులను పొందారు. 2014లో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చేతుల మీదుగా ఉత్తమ వినియోగదారుల ఉద్యమకారుడి అవార్డు అందుకున్నారు. జవహర్‌ బాలల అరోగ్యరక్ష కార్యక్రమాన్ని సక్సెస్‌ చేసినందుకు, వరంగల్‌ క్లీన్‌సిటీలో కాలుష్య నివారణపై ప్రజలను చైతన్యపరిచినందుకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులను అందుకున్నారు. ఈనెల 5న జరిగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీచేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోనున్నారు.
    అవార్డు బాధ్యతను పెంచింది
    నాకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం గర్వంగా ఉంది. ఈ అవార్డు నా బాధ్యతను రెట్టింపు చేసింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నతస్థాయి గౌరవం లభించడం ఆనందంగా ఉంది. నాన్న నేర్పిన సేవా దృక్పథమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నేను ఉద్యోగ విరమణ పొందే వరకూ విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతూనే ఉంటాను.  
    – పరికిపండ్ల వేణు, స్కూల్‌ అసిస్టెంట్‌
    పులుకుర్తి జెడ్పీ పాఠశాల  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement