ప్రాణం తీసిన అతివేగం
కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారిలో ఓర్వకల్లు–హుసేనాపురం గ్రామాల మధ్య గుట్టపాడు బస్సు స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీకొన్నాయి.
ఓర్వకల్లు – హుసేనాపురం గ్రామాల మధ్య జాతీయరహదారిపై ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం
ఇద్దరు దుర్మరణం... ఆరుగురికి గాయాలు
క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలుకు తరలింపు
ఓర్వకల్లు: కర్నూలు– చిత్తూరు జాతీయ రహదారిలో ఓర్వకల్లు–హుసేనాపురం గ్రామాల మధ్య గుట్టపాడు బస్సు స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయాలపాలయ్యారు. అతివేగమే ఈ సంఘటనకు కారణమని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డ డిపోకు చెందిన (ఏపీ21 టీఏ0126) నంబర్ గల ఆర్టీసీ అద్దె బస్సు కర్నూలు నుంచి నంద్యాల వైపు వెళ్తోంది. రాజమండ్రి నుంచి బళ్లారికి పండ్ల మొక్కలను తరలిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన(ఏపీ02టీసీ8555) నంబర్ గల ఐచర్ వాహనం గుట్టపాడు బస్‌స్టేజీ వద్ద ముందుగా వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది.
ఈ ఘటనలో ఐచర్ వాహన డ్రైవర్ నారాయణ(40) అక్కడికక్కడే దుర్మరణం చెందగా తీవ్రగాయాలైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయి(20) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మతిచెందాడు. అదే వాహనంలో ఉన్న మిగతా ఇద్దరు కో డ్రైవర్లు రహంతుల్లా, రమేష్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణిస్తుండగా వారిలో డ్రైవర్ వెంకటయ్య, కండక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు, బండి ఆత్మకూరు మండలం ఎ.కోడూరుకు చెందిన బావాబామర్దులు వెంకటేశం, వెంకటరమణకు తీవ్రగాయాలయ్యాయి. వెంకటేశం సిండికేట్ బ్యాంక్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రహదారిపై ఢీకొన్న వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వెంటనే హెడ్ కానిస్టేబుల్ కేశవరెడ్డి, పోలీసులు మల్లికార్జున, సమీర్ ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. తర్వాత స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ మల్లికార్జున ఐచర్ వాహనంలో ఇరుక్కుపోయిన నారాయణ మతదేహాన్ని యంత్రాల సాయంతో వెలికి తీయించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌చార్జ్ ఎస్‌ఐ తెలిపారు.
ప్రమాదాలకు కేరాఫ్ జాతీయ రహదారి
జాతీయ రహదారి నిర్మాణ పనులు దాదాపు ఆరేళ్లు అవుతున్నా పూర్తి కావడం లేదు. నిర్మాణ పనుల్లో భాగంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు తవ్వి ఉండటం, పలుచోట్ల క్రాసింగ్‌లు ఉండంటతో వాహనచోదకులు గుర్తించలేక ప్రమాదాల భారీన పడుతున్నారు. కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై హుసేనాపురం సమీపంలో వంతెన నిర్మాణం కోసం తవ్విన గుంతలో జూలై 31వ తేదీన ఓ పోలీసు ఉద్యోగి పడి దుర్మరణం చెందగా, ఈనెల 9వ తేదీన నన్నూరు సమీపాన గల రబ్బానీ స్టోరేజీ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలు జరిగి పట్టుమని పదిహేను రోజులు కూడా కాకముందే శనివారం ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీకొని ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.