పసిడి కంకులు పండినా.. కురవని సిరుల వాన | paddy rate not raised | Sakshi
Sakshi News home page

పసిడి కంకులు పండినా.. కురవని సిరుల వాన

Published Sun, Apr 16 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

పసిడి కంకులు పండినా.. కురవని సిరుల వాన

పసిడి కంకులు పండినా.. కురవని సిరుల వాన

దగాపడిన అన్నదాత
రబీ వరి దిగుబడి ఘనం.. ధర చూస్తే దైన్యం
ఆరుగాలం శ్రమించినా రైతుకు దక్కని లాభం
బస్తా ధాన్యం రూ.900 నుంచి రూ.950కి కొంటున్న దళారులు
అంతంతమాత్రంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
 
ప్రకృతి కరుణించి.. నేలతల్లి ఒడిలో పసిడి కంకులు పండించిన వేళ.. సిరుల రాశులు పొంగిపొరలుతాయనుకున్న అన్నదాత.. షరా మామూలుగానే మరోసారి దగా పడ్డాడు. అవసరమైన సమయంలో ప్రభుత్వం తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం.. ఇదే అదునుగా అటు దళారులు, ఇటు ధాన్యం వ్యాపారులు ధర తగ్గించేయడంతో రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోతున్నారు. దీంతో అమ్మబోతే అడవి అన్నతీరుగా రైతు పరిస్థితి మారింది.
 
అమలాపురం : అనావృష్టిని అధిగమించి.. ఆరుగాలం శ్రమించి.. డెల్టా రైతులు రబీ వరి సాగు చేశారు. మంచి ధరకు అమ్ముకుంటే లాభాలు కళ్లజూడవచ్చనుకున్నారు. ఏలేరు పరిధిలో నీటి ఎద్దడి వల్ల పోయిన పంట పోగా దక్కిన నాలుగు గింజలతో కనీసం పెట్టుబడులైనా పొందాలని ఆశించారు. కానీ వారి ఆశలను అటు ప్రభుత్వం.. ఇటు దళారులు, ధాన్యం వ్యాపారులు వమ్ము చేశారు. కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో.. లాభాల మాట దేవుడెరుగు.. రైతులు నష్టాలు చవిచూడాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో సుమారు 4.75 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరిగింది. ఇందులో గోదావరి డెల్టా పరిధిలో 4 లక్షల ఎకరాలు కాగా, ఏలేరు ప్రాజెక్టు పరిధిలో 75 వేల ఎకరాల్లో సాగు చేసినట్టు అంచనా. రెండుచోట్లా కలిపి సుమారు 14 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలు వేశారు. ఏలేరులో నీటి ఎద్దడి వల్ల సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రైతులు రూ.17 కోట్ల మేర నష్టపోయారు. డెల్టాలో ఎకరాకు సగటున 48 బస్తాల దిగుబడి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 55 నుంచి 60 బస్తాల దిగుబడి కూడా రావడంతో లాభాలు పొందవచ్చని రైతులు ఆశించారు. కానీ ధాన్యం అమ్మకాల వద్దకు వచ్చేసరికి వారు నిలువునా మోసపోతున్నారు.
ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,470 కాగా, 75 కేజీల బస్తా రూ.1,102 చొప్పున, గ్రేడ్‌-ఎ రకం బస్తా రూ.1,132 చేసి కొనుగోలు చేయాలి. కానీ ఏలేరు, డెల్టాల్లోని పలుచోట్ల సాధారణ రకం బస్తా ధాన్యాన్ని వ్యాపారులు కేవలం రూ.900 నుంచి రూ.950 చేసి మాత్రమే కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు బస్తాకు రూ.200 నుంచి రూ.250 చొప్పున ఎకరాకు రూ.9 వేల వరకూ నష్టపోయే దుస్థితి నెలకొంది. దీంతో కొంతమంది రైతులు అమ్మకాలు నిలిపి కళ్లాల్లోనే ధాన్యం నిల్వ ఉంచేశారు. ధాన్యం వ్యాపారులు, దళారుల వద్ద ముందస్తు అప్పులు చేసిన రైతులు మాత్రం.. వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. యంత్రాల ద్వారా కోత కారణంగా ధాన్యంలో తేమ (నెమ్ము) 25 శాతం పైబడి ఉందని వంక పెడుతూ మద్దతు ధరకు కోత పెడుతున్నారు.
అక్కరకు రాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 285 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ మూడో వంతు కేంద్రాలు కూడా తెరుచుకోలేదు. పైగా 17 శాతం తేమ వంటి నిబంధనల కారణంగా తెరిచిన ఆ కొద్దిపాటి కేంద్రాలవైపు రైతులు కన్నెత్తి కూడా చూడడం లేదు.
పెట్టుబడికి సరిపోతుంది
పండిన పంట పెట్టుబడికి సరిపోతుంది. పెదపూడి గ్రామంలో రెండెకరాల్లో కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 40 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. 50 బస్తాలు వస్తుందనుకుంటే చివరిలో దోమ సోకి ఎకరాకు పది బస్తాల దిగుబడి తగ్గింది. యంత్రంతో కోసిన పంట 75 కేజీలు బొండాలు రకానికి రూ.1000, సన్నాలకు రూ.900 చొప్పున ధాన్యం కమిషన్‌ వ్యాపారులు ఇస్తున్నారు. దీనివల్ల మరింత నష్టపోయేలా ఉన్నాను.
- వీవీ రమణ, కౌలురైతు, పెదపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement