నిర్లక్ష్యపు తుప్పు
నిర్లక్ష్యపు తుప్పు
Published Thu, Dec 8 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
అక్కరకు రాని ధాన్యం ఆరబోత యంత్రాలు
జిల్లాలో నిరుపయోగంగా 12 డ్రయ్యర్లు
రూ.1.92 కోట్ల నిధులు నిరుపయోగం
‘రైతే దేశానికి వెన్నెముక’.. రైతు రాజ్యం రావాలి.. రైతు అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం.. అంటూ ఊదరగొట్టే నాయకుల మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. వాస్తవంలోకి వచ్చే సరికి రైతు పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆరుగాలం శ్రమించి.. స్వేదాన్ని పసిడి రూపంలోకి మార్చే అన్నదాతలు పంటను అమ్ముకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. రైతుల ప్రయోజనం అంటూ వ్యవసాయశాఖ ద్వారా అందజేసిన ధాన్యం ఆర బోత యంత్రాలు (డ్రయ్యర్లు) ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లాలో పంపిణీ చేసిన 12 ఆరబోత యంత్రాలకు నిర్లక్ష్యపు తుప్పు పట్టడంతో రూ.1.92 కోట్లు నిరుపయోగం అయ్యే పరిస్థితి తలెత్తింది.
– రాయవరం
ఏటా ఖరీఫ్‌లో పంట చేతికంది వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే తుపాన్లు కారణంగా పంట వర్షార్పణం అవుతుంది. ఆ సమయంలో వరి పనలు తడవడం, తడిసిన ధాన్యం ఆరబోసుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం సరిగ్గా ఆరక పోవడంతో సరైన ధర దక్కక అన్నదాత నష్టపోతున్నాడు. దీంతో రైతులను ఆదుకునేందుకు వ్యవసాయశాఖ ఆరబోత యంత్రాలను సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. ఇవి రైతులకు ఆశాకిరణంగా నిలుస్తాయనుకుంటే నిరాశకు గురిచేశాయి. నాణ్యతాలోపం..రైతుల అవసరాలకు తగినట్లుగా లేకపోవడంతో అక్కరకు రాకుండా పోయాయి. ఫలితంగా వాటికి నిర్లక్ష్యపు తుప్పు పట్టి పాడైపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి.
అప్పట్లో ఏమన్నారంటే..
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యానికి మద్దతు ధర లభించాలంటే తేమ 17 శాతం ఉండాలి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు కూడా తేమశాతం ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ఈ పరిస్థితుల్లో 17 శాతం ఆరుదలకు ఆరబోత యంత్రాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని.. గంటసేపు యంత్రం పనిచేస్తే ఐదు టన్నుల ధాన్యం ఆరబోస్తుందని గతంలో వ్యవసాయశాఖ చెప్పిన మాట. అయితే దీనికి విరుద్ధంగా ఇది పనిచేయడంతో రైతులు విముఖత వ్యక్తం చేశారు. ఆరబోత యంత్రం గంటకు రెండు లీటర్ల డీజిల్ అవసరమవుతున్నా..కనీసం ఐదు బస్తాల ధాన్యం కూడా ఆరబెట్టడం లేదు. ఒక బస్తా ధాన్యం ఆరబోతకు రూ.70లు ఖర్చవుతుంది. దీంతో సొసైటీలు ఈ యంత్రాలను మూలనబెట్టాయి. భారీ యంత్రాలను భద్రపర్చేందుకు కూడా వీలు కాక ఆరుబయటే వదిలివేయడంతో తుప్పుపట్టిపోతున్నాయి.
రూ.1.92 కోట్లు నిరుపయోగం..
జిల్లాలో ఏటా 2.20 లక్షల హెక్టార్లలో వరిసాగు జరుగుతుంది. తద్వారా ఏటా 10 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. తడిసిన ధాన్యం ఆరబోసుకునేందుకు 2014 రబీలో ధాన్యం ఆరబోత యంత్రాలను వ్యవసాయశాఖ ద్వారా కొనుగోలు చేశారు. జిల్లాలో సోమేశ్వరం, కరప, కాజులూరు, దుగ్గుదూరు, కొంకుదురు, కొమరిపాలెం, చోడవరం, దేవగుప్తం, జెడ్.మేడపాడు, సామర్లకోట, భీమనపల్లి, జి.మేడపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వీటిని రాయితీపై అందించారు. ఒక్కో ఆరబోత యంత్రం విలువ రూ.16 లక్షలు. ఇందులో సహకార సంఘం రూ.4 లక్షలు చెల్లిస్తే..మిగిలిన రూ.12 లక్షల సొమ్మును రాయితీగా వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఒక్క యంత్రం కూడా పనిచేయలేదు. ఫలితంగా రూ.1.92 కోట్ల సొమ్ము నిరుపయోగమైందనే విమర్శలు విన్పిస్తున్నాయి.
Advertisement