స్వైపింగ్‌ మెషీన్లు అలంకారప్రాయమే | swiping machines not using | Sakshi
Sakshi News home page

స్వైపింగ్‌ మెషీన్లు అలంకారప్రాయమే

Published Thu, Jan 19 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

స్వైపింగ్‌ మెషీన్లు అలంకారప్రాయమే

స్వైపింగ్‌ మెషీన్లు అలంకారప్రాయమే

రిజస్ట్రేషన్‌ శాఖకు 32 మెషీన్ల అందజేత
దాదాపు అన్నిచోట్లా వినియోగించని సిబ్బంది
పట్టించుకోని డిఐజీ
కాకినాడ లీగల్‌ (కాకినాడ సిటీ) : నగదు రహిత లావాదేవీల కోసమంటూ స్టాంప్స్‌ అండ్‌ రిజస్ట్రేషన్‌ శాఖలో స్వైపింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేసినా, వాటి వినియోగించింది లేదు. స్థిరాస్థి హక్కుదారులు, వాటి కొనుగోలుదారులు ఈసీలు, నకళ్లు తీసుకునేందుకు, ఇతర సేవలు పొందేందుకు జిల్లాలోని 32 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ లక్ష్మీకుమారి ఈ నెల 3న  ఈ  స్వైపింగ్‌ మెషీన్లు అందజేశారు.ఈసీలు, నకళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి తీసుకున్న నగదుకు రసీదు ఇవ్వాలి.అయినప్పటికీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఉద్యోగులు వాటిని ఇవ్వడం లేదు. దీనివల్ల ఈసీ, నకలు కోసం దరఖాస్తు చేసుకున్న వారు వారం రోజులపాటు ఈ ‍కార్యాలయం చుట్టూ తిరగక తప్పడం లేదు.
స్వైపింగ్‌ మిషన్‌ వినియోగంలో ఉంటే లాభమేమిటి?
స్వైపింగ్‌ మెషీన్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో వినియోగంలో ఉంటే  నగదు లావాదేవీలు జరిపే సమయం బిల్లులో వస్తుంది. సిటిజన్‌ చార్ట్‌ ప్రకారం ఈ బిల్లు తీసుకున్న కక్షిదారుడికి కంప్యూటర్‌ ఈసీ గానీ, నకలు గానీ గంటలోగా ఇవ్వాలి. అదే మాన్యూల్‌ ఈసీగానీ, నకలు కానీ 24 గంటల్లో అందజేయాలి. ఈ కారణంగా రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులు స్వైపింగ్‌ మెషీన్‌ను పక్కన పెట్టి నగదు రూపంలో సొమ్ము తీసుకుంటున్నారు. 
నిర్ధేశిత సమయానికి ఇవ్వకపోతే పరిహారం
సిటిజన్‌ చార్ట్‌ ప్రకారం నకళ్లు, ఈసీలు ఇవ్వాల్సిన సమయాన్ని ఖరారు చేస్తూ 2013లో జీవో నంబర్‌ 1054ను ప్రభుత్వం జారీచేసింది. ఈ జీవో ప్రకారం కక్షిదారుడు కంప్యూటర్‌ ఈసీగానీ, నకలుకుగానీ దరఖాస్తు చేసుకున్న గంటలోగా ఇవ్వకపోతే ఆ ఉద్యోగి ప్రతి గంటకు రూ.10 చొప్పున కక్షిదారుడికి చెల్లించాలి. అలాగే మాన్యూల్‌ ఈసీగానీ, నకలు గానీ 24 గంటల్లో తిరిగి ఇవ్వకపోతే రూ.50  ఇవ్వాలి. 
స్వైపింగ్‌ను ఎందుకు ఉపయోగించడం లేదంటే...
జిల్లాలో కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్వైపింగ్‌ మెషీన్‌ ద్వారా ఈసీలు, నకళ్లు ఇవ్వడం లేదు. కారణం ఏమిటని కక్షిదారులు ప్రశ్నిస్తుంటే.... స్వైపింగ్‌ మెషీన్‌ ద్వారా ఈసీలు, నకళ్లు ఇస్తుంటే డైరెక్టుగా కక్షిదారులు ఇచ్చే సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందని సిబ్బంది బదులిస్తున్నారు. ఆడిట్‌ జరిగినపుడు ప్రభుత్వ ఖాతాలో ఉన్న సొమ్ము జమ అయినట్టు ఉంటుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ ఖాతాకు వెళ్లక పోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. దీంతో కొన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల సిబ్బంది స్వైపింగ్‌ మెషీన్లను పక్కన పెట్టేశారు. 
ప్రభుత్వ ఖజానాకు ఇలా చిల్లు...
30 ఏళ్ల పైబడినవారు ఈసీ తీసుకుంటే రూ.520 రిజిస్ట్రేషన్‌శాఖకు చెల్లించాలి. 30 ఏళ్ల లోపు వారు ఈసీ తీసుకుంటే రూ.220 చెల్లిస్తే సరిపోతుంది. అయితే నగదు రూపంలో కొన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కక్షిదారుల వద్ద నుంచి రూ.520 ఈసీకు తీసుకుని ప్రభుత్వ ఖాతాకు 30 ఏళ్ల లోపు వ్యక్తి తీసుకున్నట్టు చూపించి రూ.220 మాత్రమే జమ చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గతంలో తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కక్షిదారుడికి ఈసీ కానీ, నకలు కానీ ఇస్తున్నారు. అయితే వారి వద్ద నుంచి తీసుకున్న నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా సిబ్బంది జేబుల్లో వేసుకుంటున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. స్వైపింగ్‌ మెషీన్‌ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే కక్షిదారుడికి నష్టం ఉండదు. ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడదు. జిల్లాలో అందజేసిన 32 స్వైపింగ్‌ మెషీన్లను ఆయా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో  వినియోగిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని డీఐజీ పట్టించుకుంటే ఈ అక్రమాలను అరికట్టవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement