విజయనగరం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఐటీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సంక్షేమం కోసం సాయం చేయండని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరితే అభినందించాల్సింది పోయి... అడుక్కునే ముఖ్యమంత్రి మనకు వద్దని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని ఆయన ఆరోపించారు. ఆంధ్ర ప్రజల శాపనార్థాలు ఆ పార్టీకి తగులుతాయని మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు మద్యం సిండికేట్ నడిపిస్తున్నారనే ఆరోపణల గురించి ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డిని విలేకర్లు ప్రశ్నించగా... బెల్టుషాపులపై చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.
ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించాలని.. అలాగే సిండికేట్ బాస్‌లు ఎవరైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో మంత్రి కె. మృణాళిని, జెడ్పీ చైర్‌పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే నాయుడు తదితరులు పాల్గొన్నారు.