ఏజెంట్లను నిర్బంధించిన పెరల్స్ బాధితులు
ఏజెంట్లను నిర్బంధించిన పెరల్స్ బాధితులు
Published Thu, Apr 27 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM
యర్నగూడెం (దేవరపల్లి) : డిపాజిట్లు కాలపరిమితి దాటినా చెల్లించడం లేదని యర్నగూడెంలో పెరల్స్ బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. బుధవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఏజెంట్లను చుట్టుముట్టి సుమారు రెండు గంటల పాటు నిర్బంధించారు. డిపాజిట్లు చెల్లించే వరకు కదలనీయమని పట్టుపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. యర్నగూడెంకు చెందిన సుమారు 150 మంది కూలీ, నాలీ చేసుకుని పొట్టపోసుకుంటున్న కార్మికులు పెరల్స్ సంస్థలో సుమారు రూ. 2 కోట్లు డిపాజిట్ చేశారు. డిపాజిట్ కాలపరిమితి పూర్తి కావడంతో వడ్డీతో సహా డిపాజిట్లు చెల్లించాలని సంబంధిత ఏజెంట్లను కోరారు. అదిగో వస్తాయి. ఇదిగో వస్తాయంటూ ఏజెంట్లు కాలయాప చేస్తూ వస్తున్నారు. ఏజెంట్లపై నమ్మకం లేకపోవడంతో కొందరు డిపాజిట్ దారులు రాజమండ్రిలోని సంస్థ కార్యాలయాలని పలుమార్లు తిరిగారు. అక్కడ కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో అయోమయంలో పడ్డారు. అప్పటి నుంచి ఏజెంట్లు కూడా జాడలేక పోవడంతో మోసపోయామని గ్రహించిన డిపాజిట్ దారులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మథనపడుతున్నారు. బుధవారం సాయంత్రం గ్రామానికి వచ్చిన ఏజెంట్లను చుట్టుముట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్భంధించి తమ డిపాజిట్లు చెల్లించాలని పట్టుపట్టారు. అయితే సంస్థ కొన్ని ఇబ్బందుల్లో ఉందని, త్వరలో డిపాజిట్లు చెల్లిస్తుందని ఏజెంట్లు నచ్చజెప్పారు. బాధితులు ముంగర మహంకాళి, గణుసుల పాపమ్మ, ముంగర వీరాస్వామి, టి. సాంబమూర్తి, గణుసుతల చంటియ్య మట్లాడుతూ గ్రామంలో సుమారు 200 మంది వరకు బాధితులు ఉన్నామని తెలిపారు. ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్లు చేశామని చెప్పారు. పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయని డిపాజిట్లు చేశామని, ఈ విధంగా మోసం జరుగుతుందని ఊహించలేదని బాధితులు వాపోయారు. కాగా గ్రామస్తులు జోక్యం చేసుకుని బాధితుల నుంచి ఏజెంట్లను విడిపించారు.
Advertisement
Advertisement