నలుగురిని కనండి..
ఒకరిని దేశానికి ఇవ్వండి- పరిపూర్ణానంద స్వామీజీ
కదిరి: ‘దేశ జనాభా పెరిగిపోతోందన్న బెంగ అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ నలుగుర్ని కనండి. వారిలో ఒకరిని దేశసేవ కోసం పంపండి. ఇంకొకరు తల్లిదండ్రులను చూసుకుంటారు. మిగిలిన ఇద్దరూ సంపాదించడానికి సరిపోతారు’ అని శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామీజీ అన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోమగుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి నూతన గృహ ప్రవేశానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించారు.
దేవుణ్ని కొలిచేందుకు ఆలయానికి వెళ్లేందుకు తనకు సమయం సరిపోవడం లేదని కొందరు చెబుతుంటారని, ఇది సరికాదన్నారు. భగవంతుణ్ని స్మరించడానికి రోజులో అరగంట కేటాయించాలని సూచించారు. ప్రతి ఇంట్లో పూజ గది ఉంటుందని, అది దేవుడి కోసం కాదని.. ఆయన్ను స్మరించుకోవడానికి నీవు కేటాయించుకున్న గది అని ఉద్బోధించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీప వెంకట్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, జెడ్పీ చైర్మన్ చమన్, ప్రముఖులు హాజరయ్యారు.