
ఇంకా ఎందుకు భయపెడుతున్నారు?
రాజధాని ప్రాంతంలో పేద రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపెడుతోందని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి ఆరోపించారు.
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో పేద రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపెడుతోందని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారధి ఆరోపించారు. భూములు ఇవ్వని రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం భూదాహం ఇంకా తీరినట్టు లేదని వ్యాఖ్యానించారు. భూసేకరణ పేరుతో మరోసారి భూములు లాక్కుటోందన్నారు.
తన పంటను తగలబెట్టారని చంద్రశేఖర్ అనే రైతు కేసు పెడితే.. తగలబడిందని చెప్పించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వేల ఎకరాలు సేకరించిన తర్వాత కూడా రైతులను ఎందుకు భయపెడుతున్నారని ప్రశ్నించారు. రాజధానిలో పేదలు ఉండకూడదా అని నిలదీశారు.
రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న పంటలు చేతికిరాని పరిస్థితి వుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టాలో నీళ్లులేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఈ ప్రభుత్వం రైతులందరినీ నాశనం చేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బలవంతపు భూసేకరణకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రైతులకు అండగా ఉంటామన్నారు. ఇప్పటికే సేకరించిన భూముల్లో రాజధాని కట్టుకోవాలని, బలవంతంగా భూములు లాక్కోవద్దని పార్థసారధి హితవు పలికారు.