మన్యంలో కలకలం | paster killed | Sakshi
Sakshi News home page

మన్యంలో కలకలం

Published Sat, Jul 30 2016 11:22 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

మన్యంలో కలకలం - Sakshi

మన్యంలో కలకలం

  • ఇన్‌ఫార్మర్‌ నెపంతో పాస్టర్‌ హత్య
  • చింతూరు:
    అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్న మావోయిస్టులు రెండోరోజే ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరిని హతమార్చి మన్యంలో కలకలం సృష్టించారు. చింతూరు మండలం లచ్చిగూడెం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్‌ వుయికా మారయ్య(35)ను మావోయిస్టులు శుక్రవారం అర్థరాత్రి గొంతుకోసి హతమార్చారు. దాంతో మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగస్టు 3 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాల్లో మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో అని అందరిలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారు ఈ దురాగతానికి పాల్పడ్డారు. 
    ఇన్‌ఫార్మర్ల పేరుతో హత్యలు
    పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నందునే తాము హత్యలకు పాల్పడుతున్నట్టు మావోయిస్టులు పేర్కొంటున్నారు. గతేడాది ఏప్రిల్‌ 25వ తేదీన చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని అల్లివాగు గ్రామానికి చెందిన వలస గిరిజనుడు పొడియం నడుగును మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌ నెపంతో హతమార్చారు. అదే నెలలో ఎటపాక మండలం కామన్‌తోగు గ్రామానికి చెందిన మడివి జోగయ్య, సోయం చుక్కయ్యలను హతమార్చారు. మే 4వ తేదీన చింతూరు మండలం బుర్కనకోగ గ్రామానికి చెందిన కుంజా బ్రహ్మయ్య, కుంజా సీతారామయ్య అనే అన్నదమ్ములను మావోయిస్టులు హతమార్చారు. 2014లో చింతూరు మండలం దొంగల జగ్గారం, నర్శింగపేట, అల్లిగూడెం, తుమ్మల గ్రామాలకు చెందిన పలువురిని మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల నెపంతో హతమార్చారు. అలాగే గతేడాది చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన సుమారు 50 మందిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. ఆ తర్వాత క్షేమంగా విడిచిపెట్టారు. ఇదే క్రమంలో గతేడాది ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చర్చి పాస్టర్‌ కన్నయ్య  కొడుకు ఇసాక్‌తో పాటు కొంతమంది పాస్టర్లను మావోయిస్టులు కిడ్నాప్‌ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మారయ్య లక్ష్మీపురం చర్చి పాస్టర్‌ కన్నయ్య సోదరుడే.
    రంగంలోకి ఖమ్మం జిల్లా కమిటీ?
    విలీన మండలాల్లో గతేడాది వరకు మావోయిస్టు శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా పనిచేసేది. గతేడాది డిసెంబర్‌లో కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్‌ నగేష్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో కమిటీ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఈ కమిటీకి కొత్త కార్యదర్శిని నియమించారని పలుపేర్లు వినబడినప్పటికీ పోలీసులు దానిని ధృవీకరించలేదు. ఇటీవల వరుసగా మందుపాతర్ల సంఘటనలు, ప్రస్తుతం మారయ్య హత్య నేపధ్యంలో విలీన మండలాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు ఖమ్మం జిల్లా కమిటీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సంఘటన స్థలంలో లభ్యమైన లేఖలో ఇదే కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పేరు వుండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.
    పద్ధతి మారకుంటే ఇదేగతి
    చింతూరు మండలంలోని పేగ, అల్లిగూడెం గ్రామాలకు చెందిన చాలామంది పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని మారయ్య మృతదేహం వద్ద మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి పేరుతో ఉంచిన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. వారు తమ పద్ధతిని మార్చుకోకుంటే ఇదేగతి పడుతుందని ఆ లేఖలో  హెచ్చరించారు. పేగ గ్రామానికి చెందిన 17 మంది, అల్లిగూడెం గ్రామానికి చెందిన 14 మంది, వినాయకపురం గ్రామానికి చెందిన ఐదుగురి పేర్లను ఆ లేఖలో పేర్కొన్నారు. లక్ష్మీపురం చర్చి పాస్టర్‌ కన్నయ్య అక్రమ పద్ధతుల్లో ఆస్తులు కూడగట్టాడని, అతనిని పలుమార్లు హెచ్చరించినా వినకుండా తమనుంచి తప్పించుకు తిరుగుతున్నాడని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. అతని బాటలోనే అతని సోదరుడు మారయ్య కూడా నడుస్తుండడంతో అతనిని కూడా హెచ్చరించామన్నారు. అయినప్పటికీ అతని తీరు మారక పోవడంతో ప్రజాకోర్టులో శిక్షించినట్టు లేఖలో పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement