మారని రోగుల తల’రాత’ | patients cheated by medicine mafia | Sakshi
Sakshi News home page

మారని రోగుల తల’రాత’

Published Mon, Jul 31 2017 12:39 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

మారని రోగుల తల’రాత’ - Sakshi

మారని రోగుల తల’రాత’

అర్థంకాని మందులరాతలో ఆంతర్యమేమిటో?
వైద్యలు రాసే మందుల చీటీతో అవస్థ 
వైద్యశాఖ నిబంధనలు బేఖాతరు
ఆస్పత్రి వద్ద దుకాణాలే దిక్కంటున్న పేషంట్లు 
తణుకు అర్బన్‌ :
వైద్యులు కలిపిరాతతో రాస్తున్న మందుల చీటీలు రోగులపాలిట శాపంగా మారాయి. మందుల చీటీతో మందుల దుకాణాలకు వెళ్లిన రోగులకు ఏ డాక్టర్‌ రాశారమ్మా మాకు అర్థం కావట్లేదనే సమాధానాలు వస్తుండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
జిల్లాలో 1500కు పైగా వైద్యులు
జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు 450 ఉండగా ఇందులో కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటిలోను సుమారుగా 1300కు పైగా వైద్యులు వైద్య విధులు నిర్వర్తిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ విభాగంలో వైద్య విధాన పరిషత్‌లో ఏలూరు జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులైన తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంతో పాటు అదనంగా 14 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు ఉన్నాయి. వీటిలో 95 మంది వైద్యులు విధుల్లో ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖలోని 93 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో మొత్తం 125 మంది వైద్యులు ఉన్నారు. వీరిలో తక్కువ మంది మాత్రమే పెద్ద అక్షరాలు విడివిడిగా రాస్తున్నారు. 
వైద్యుల అనుబంధ మందుల దుకాణాల్లోనే..
ప్రైవేటు వైద్యులు తమ ఆసుపత్రికి సంబంధించిన మందుల దుకాణంలోని ప్రతినిధికి మాత్రమే అర్థమయ్యేలా మందులు చీటీలో రాస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. బయట మందుల దుకాణాలకు చీటీ తీసుకువెళ్లినా వైద్యుడి చేతిరాత అర్థం కావడంలేదని ఆయనకు సంబంధించిన మందుల దుకాణంలోనే తీసుకోవాలని చెబుతున్నారని రోగులు చెబుతున్నారు. బయట దుకాణాల్లో అదే మందుపై ఎంఆర్‌పీపై 10 నుంచి 15 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారని, అదే వైద్యులకు సంబంధించిన మందుల దుకాణంలో ఎంఆర్‌పీ ధరలకే అమ్మకాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలే మందుల ధరలు భారీగా పెరిగిపోయిన రోజుల్లో వైద్యులు మందుల వ్యాపారం కూడా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరుతో పాటు భీమవరం, తణుకు ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రోగులకు అవసరంలేని మందులు కూడా రాసి మందుల కొనుగోళ్ల శాతం పెంచుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో పేద రోగులకు వచ్చే పెద్ద వైద్యానికి వైద్య పరీక్షలతో పాటు మందుల ఖర్చు కూడా భారంగా మారింది. 
నిబంధనలకు పాతర
మందుల చీటీలో కలిపిరాత కాకుండా పెద్దగా కనిపించేలా విడి అక్షరాలతో మందులు రాయాలని, అది కూడా ఏ పూట ఏ మందు వేసుకోవాలో రోగులకు వివరంగా అర్థమయ్యేలా మందుల చీటీ ఉండాలని న్యాయస్థానం గతంలో ఆదేశాలు జారీ చేసినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. కానీ ఈ నిబంధనలు ప్రైవేటు ఆసుపత్రుల్లో 10 శాతం కూడా అమలు కావడంలేదు. మెడికల్‌ కంపెనీల రిప్రజెంటేటివ్‌లతో కుదిరిన ఒప్పందాలతో ఆ మందులు దొరికే దుకాణాల పేరుతో ముద్రించిన చీటీల్లోనే ముందులు రాస్తుండడం, ఇటు ప్రైవేటు, అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కనిపిస్తోందని రోగులు విమర్శిస్తున్నారు. 
 
 
వైద్యుడు రాసిన మందులు అర్థంకావు
వైద్యుడి రాసిన మందుల చీటీలో మందులు వారి మందుల దుకాణంలోనే అర్థం అవుతాయి. అంతేకాకుండా మెడికల్‌ రిప్‌లతో జరిగిన ఒప్పందాల కారణంగా ఆ మందులు ఉన్న మందుల దుకాణాల ప్రతినిధులకు మాత్రమే అర్థమయ్యేలా మందుల చీటీ రాస్తున్నారు. 
                   వై.శ్రీహరి, తణుకు
 
 
 
విడి అక్షరాలతో రాయాలని ఆదేశిస్తాం 
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులకు ఇప్పటికే కలిపిరాతతో మందులు రాయకూడదని సర్కులర్‌ పంపించాం. మరొకసారి పరిశీలించి వైద్యులను విడి అక్షరాలతోనే మందులు రాయాల్సిందిగా హెచ్చరిస్తాం.
           డాక్టర్‌ డి.కోటేశ్వరి, డీఎంహెచ్‌వో, ఏలూరు
 
 
విడి అక్షరాల్లోనే మందులు రాయాలి
నిబంధనల ప్రకారం వైద్యులు ప్రిస్కెప్షన్‌లో పెద్దగా విడి అక్షరాలతో మందులు రాయాల్సి ఉంది. వైద్య విధాన పరిషత్‌లోని వైద్యులందరికీ నిబంధనలు పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తాం.
డాక్టర్‌ కె.శంకరరావు, డీసీహెచ్‌ఎస్, ఏలూరు
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement