
'అందుకు పవన్ వ్యతిరేకం కాదు'
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకం కాదని సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.
విజయవాడ సిటీ: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకం కాదని సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణంతో పాటు ప్రతి ఒక్కరూ బాగుండాలనేది పవన్ అభిమతమన్నారు. తాము చేస్తున్న కార్యక్రమాలను పవన్ అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి సమావేశంలో నిర్ణయించారన్నారు. అక్రిడేషన్ కమిటీల్లో పోలీసులు ఉండరు మీడియా అక్రిడేషన్ కమిటీల్లో పోలీసులను తొలగిస్తూ మరో జీవో ఇవ్వనున్నట్టు మంత్రి పల్లె చెప్పారు. మీడియాపై దాడులను నిలువరించేందుకు ఏర్పాటు చేసే కమిటీల్లో మాత్రం పోలీసు అధికారులు సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు.
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. హెల్త్‌కార్డుల వినియోగంలో నెలకొన్న చిన్నపాటి సమస్యలను వెంటనే తొలగిస్తామన్నారు. జర్నలిస్టులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉన్నట్టు వివరించారు. వీలైనంత త్వరలోనే ఈ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరుపై ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. జర్నలిస్టు హెల్త్‌కార్డు పని చేయక ఏలూరుకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామేన్ సుధాకర్ (నాని) మృతి చెందిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన రూ.20 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.