– వజ్రకరూరు వాటర్‌షెడ్‌లో నాసిరకంగా పనులు
– ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన అధికారులు
– ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ల సరెండర్
– డ్వామాలో రిపోర్ట్ చేసుకోవాలని పీడీ ఉత్తర్వులు
– సమగ్ర విచారణకు క్వాలిటీ కంట్రోల్ టీం ఏర్పాటు
సాక్షి ఎఫెక్ట్
అనంతపురం టౌన్ : వజ్రకరూరు వాటర్‌షెడ్ పరిధిలో అక్రమాలు నిజమేనని అధికారులు తేల్చారు. పనులు నాసిరకంగా చేపట్టడం, అవసరం లేని పనులు చేసి బిల్లులు చేసుకోవడం, బినామీ పేర్లతో బిల్లులు దిగమింగిన వైనాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో అధికారులను డ్వామా కార్యాలయానికి సరెండర్ చేసుకున్నారు. వాటర్‌షెడ్ పరిధిలోని వజ్రకరూరు, రాగులపాడు, తట్రకల్లు, ఎన్‌ఎన్‌పీ తండా, బోడిసానిపల్లి, గంజికుంట గ్రామాల్లో 2009–10 బ్యాచ్ కింద చేపట్టిన పనుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అధికారులు కలిసి అక్రమాల వరద పారించారు. ఈ అవినీతి బాగోతంపై ఈ నెల 11న ‘వాటాల పంట’, 12వ తేదీన ‘చెక్ ఢాం’, 13న ‘కుంట నక్కలు’, 14వ తేదీన ‘వజ్ర వంకర్లు’ శీర్షికతో ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. వీటిపై కలెక్టర్ జి.వీరపాండియన్ సీరియస్ అయ్యారు.
తక్షణం విచారణకు ఆదేశించడంతో మొదటి రోజే వాటర్‌షెడ్ అదనపు పీడీ విజయ్‌కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నాసిరకం నిర్మాణాలున్నాయని, అవసరం లేని చోట నిర్మాణాలు చేశారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా నివేదికను డ్వామా పీడీ నాగభూషణంకు అందజేశారు. ఇదే సమయంలో ‘సాక్షి’లో కథనాల పరంపర కొనసాగడంతో వాటర్‌షెడ్ పరిధిలో జరిగిన పనులన్నింటినీ పరిశీలించాలన్న నిర్ణయానికొచ్చారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ బృందాన్ని నియమించారు. ఇందులో వాటర్‌షెడ్ అదనపు పీడీ విజయ్‌కుమార్, డీబీఓ చంద్రశేఖర్, సీనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి రవీంద్రనాథ్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గోవర్దన్ ఉన్నారు. తక్షణ చర్యల్లో భాగంగా ప్రాథమికంగా అందిన ఆధారాల మేరకు ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్న సూర్యనారాయణతో పాటు పనులు జరిగే సమయంలో జూనియర్ ఇంజినీర్‌గా ఉన్న సంజీవ్‌కుమార్ (ప్రస్తుతం కణేకల్లు డబ్ల్యూసీసీలో పని చేస్తున్నారు)ను ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డ్వామాలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
శింగనమల డబ్ల్యూసీసీ పీఓగా ఉన్న ఆర్.రాజాకు ఉరవకొండ డబ్ల్యూసీసీ బాధ్యతలు అప్పగించారు. ఇక కణేకల్లులో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సుధాకర్‌కు కణేకల్లు డబ్ల్యూసీసీ ఇన్‌చార్జ్ జూనియర్ ఇంజనీర్‌గా బాధ్యతలు అప్పగించారు. క్వాలిటీ కంట్రోల్ బృందాన్ని విచారణకు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పీఓ ప్రభావం లేకుండా ఉండేందుకు సరెండర్ చేసుకున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం ‘సాక్షి’కి తెలిపారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలుంటాయన్నారు. కొల్లగొట్టిన నిధులను తప్పకుండా రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.
అక్రమాలు నిజమే!
Published Sat, Jul 15 2017 11:02 PM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM
Advertisement
Advertisement