అభివృద్ధి బాధ్యత ఎవరిది..?
♦ గెలిచిన ఎమ్మెల్యేదా..ఓడిన వారిదా..!
♦ రూ.కోట్ల నిధులు తెచ్చినా..
♦ అడ్డుకుంటున్నదెవరు..?
♦ రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్
♦ పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట: నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విమర్శంచడం సరైందికాదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేపై ఉంటుందా.. ఓడిన వారిపై ఉంటుందా.. అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని సర్వాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే నర్సంపేట నియోజకవర్గానికి రూ.వేల కోట్లు మంజూరు చేస్తే ఎమ్మెల్యే, అతని అనుచరులు కాంట్రాక్టులు పొంది పనులు చేపట్టడంలో తాత్సారం చేయడంలేదా అని అన్నారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక్క ఎకరానికైనా నీరందించిందా అనే ముందు మాధవరెడ్డి వాస్తవాన్ని గుర్తించాలని హితవు పలికారు. మిషన్ కాకతీయ ఫెజ్–1,2,3 కింద 219 చెరువుల పునరుద్ధరణకు రూ.88.45 కోట్లు ప్రభుత్వం మంజూరుచేయగా 50శాతం కాంట్రాక్టర్లు మీరే కదా అని గుర్తు చేశారు. మాధన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా చేయాలని రూ.7.50కోట్లు మంజూరు చేయించామని, రెండు సంవత్సరాలు కావస్తున్న పనులు జాప్యం చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 10 పథకాలు చెప్పి తొమ్మిది పథకాలు అమలు చేసిందని, మూడేళ్లుగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగి కనీసం నర్సంపేట అభివృద్ధిపై శాసనసభలో ఒక్కసారైనా గళం విపారా అని మాధవరెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూరం కూడా నిర్మించలేకపోయిందంటున్న ఆయనకు నిర్మాణానికి సంబంధించి పూర్తి అధికారలను ఎమ్మెల్యేలకు కల్పిస్తూ సీఎం జీవో జారీ చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు.
నర్సంపేటకు మంజూరైన ఇళ్ల కోసం ఇంత వరకు ఎందుకు ప్రతిపాదనలు పప్పించకుండా అడ్డుకున్నదేవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ మునిగాల పద్మవెంకట్‌రెడ్డి, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, దార్ల రమాదేవి, గుంటికిషన్, నాగెల్లి వెంకటనారాయణ, బండి రమేష్, నాగిశెట్టి ప్రసాద్, పుట్టపాక కుమారస్వామి, బండి ప్రవీణ్, సందీప్, మందుల శ్రీనివాస్, మచ్చిక నర్సయ్య, దారంగుల నగేష్, బైరి మురళి పాల్గొన్నారు.