గోవిందుడి లీల.. ...పల్లంతా గోల గోల | Peela Govinda Satyanarayana hulchul in ANAKAPALLE | Sakshi
Sakshi News home page

గోవిందుడి లీల.. ...పల్లెంతా గోల గోల

Published Sun, Jul 17 2016 9:06 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

గోవిందుడి లీల.. ...పల్లంతా గోల గోల - Sakshi

గోవిందుడి లీల.. ...పల్లంతా గోల గోల

గోవిందుడి లీల.. అనకాపల్లంతా గోల గోల
 
 
ఆమె సాధారణ ఉద్యోగి కాదు.. ఓ రెవెన్యూ డివిజన్‌కు సారధ్యం వహిస్తున్న అధికారి.. సర్వీసు బాగుండి, అన్నీ కలిసొస్తే రాబోయే రోజుల్లో కాబోయే కలెక్టర్ కూడా. అటువంటి అధికారిని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఇటీవల మొహమాటపెట్టి ఆమె పుట్టినరోజు వేడుకల పేరుతో నానా ఆర్భాటం చేశారు. అదీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే!
 
 ఇదేంటి.. రాజకీయ పార్టీ కార్యాలయంలో ఉన్నతాధికారి బర్త్‌డేనా.. అని ఆక్షేపించిన వారిపై.. ‘నేను ఎమ్మెల్యే కాకుంటే పెద్ద రౌడీనంటూ’ బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే కాకుంటే ఆయన రౌడీ అయ్యేవారో.. ఇంకేదైనా అయ్యేవారో మనకెందుకుగానీ.. ఎమ్మెల్యేగా ఎన్నికైనందున ఆయన ప్రజాప్రతినిధిగా మసలుకోవాలి. తనను గెలిపించిన అనకాపల్లి ప్రజలకు రుణం తీర్చుకోవాలి.
 
 కానీ.. ఈ రెండేళ్లలో అనకాపల్లికి ఆయన ఏం చేశారు? ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా.. అసలు ఆ ప్రయత్నమైనా చేస్తున్నారా.. లేక ఎమ్మెల్యే కాకపోతే ఏదో అయ్యేవాడినని తనే అన్నట్లు.. పైలాపచ్చీస్‌గానే వ్యవహరిస్తున్నారా!.. నోటికొచ్చినట్టు మాట్లాడి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారా!!... అసలు అనకాపల్లిలో ఏం జరుగుతోందో..విశాఖ తీరం నుంచే చూద్దాం రండి..

 
 
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఒంటి మీద ఖాకీ షర్ట్ లేకుంటే నేనో పెద్ద రౌడీ.. ఇది తెలుగు మాస్ మసాలా సినిమాల్లో తరచూ వినిపించే డైలాగ్. అనకాపల్లిలో ఇటీవల జరిగిన ఒక బహిరంగ సమావేశంలో తాను ఎమ్మెల్యే కాకుంటే పెద్ద రౌడీనని, తడాఖా చూపించేస్తానంటూ ఎమ్మెల్యే పీలా గోవింద్ మీడియాపై చేసిన  ప్రేలాపనలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలకు ముందు ఎంతో సౌమ్యుడిగా కనిపించిన ఈ గోవిందుడు.. తాను అందరివాడినని నమ్మించాడు. ఎన్నికల తర్వాతే అసలు రూపం బయటపడింది. వివాదాస్పద వ్యవహారశైలితో పాటు నియోజకవర్గ అభివృద్ధిని కనీసమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు. తానిచ్చిన హామీల అమలు గురించి కూడా వీసమెత్తు ఆలోచన చేయడం లేదు.
 
 హా..మీలు!
 తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తానని, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎన్నికల ముందు పీలా హడావుడి చేశారు. తీరా తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా చక్కెర కర్మాగారం ఆధునికీకరణ మాట దేవుడెరుగు.. కనీసం గత సీజన్ లో గానుగాట కూడా లేకుండాపోయింది. ఫలితంగా రైతులు నిండా మునిగిపోయినా పీలా పట్టించుకోలేదు. గత సీజన్‌కు చెందిన బకాయిలను ఇటు రైతులకు చెల్లించలేకక, అటు కార్మికులకు జీతాలు అందించలేక నష్టాల్లో ఉన్న కర్మాగారాన్ని గట్టెక్కించే యత్నం కూడా  చేయలేదు.  ప్రస్తుతం  ఈ కర్మాగారాన్ని విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావుకు కట్టబెట్టేందుకుగానూ పీలా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
 ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక  అమ్మవారికి వజ్ర కిరీటాన్ని తయారీ చేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇపుడు ఆ విషయంలో మౌనముద్ర వహిస్తున్నారు. పైగా వజ్రకిరీటం పేరుతో విశాఖ నగరంలోని ఒక ప్రముఖ వస్త్ర వ్యాపారి వద్ద, మద్యం షాపుల వద్ద భారీగా సొమ్ములు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయనగారి హయాంలో నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా చేస్తున్నారనే వాదనలున్నాయి.
 
 ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అనకాపల్లిలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుని అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చిన ఆయన ఇప్పటికీ  పెందుర్తి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు.
 అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో వర్తకులకు సమస్యగా మారిన నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేయిస్తామని వాగ్దానం చేసినా.. ఇప్పటికీ స్పష్టమైన ఉత్తర్వులు తీసుకురాలేకపోయారు.
 దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సత్యనారాయణపురం లే అవుట్‌లో లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వలేకపోయారు. శంకరంలో రాజీవ్ గృహకల్ప సముదాయంలో లబ్ధి దారులకు గృహాలను అప్పగించలేకపోయారు.
 అనకాపల్లి మండలంలో జూనియర్ కళాశాలలు నెలకొల్పేలా కృషి చేస్తామన్న హామీ గాలిలో కలిసిపోయింది. అనకాపల్లి మున్సిపాలిటీ జీవీఎంసీలో విలీనమైనప్పటికీ ఉద్యోగుల ఖాళీల భర్తీ, జీవీఎంసీ పాలన విషయంలో ఇప్పటికీ పట్టు సాధించలేకపోయారు.
 
 పీలా.. ఇలాగైతే ఎలా?
 
ఎమ్మెల్యే అయిన తర్వాత పీలా గోవిందును చుట్టుముట్టిన ఆరోపణల్లో అనకాపల్లి ఆవఖండం లే అవుట్ ప్రధానమైంది. అనకాపల్లి ఆవ, ఆవఖండం 2500 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎటువంటి లే అవుట్లు వేయరాదు. కానీ పీలా మాత్రం ఆవఖండం లే అవుట్ వేసిన రియల్టర్లకు అండగా నిలిచారు. తన కుమారుడి పెళ్లికి అదే లే అవుట్ పరిసరాలను వినియోగించుకున్నారు. ఈ సమయంలోనే లే అవుట్‌ను చదును చేసేందుకు రేబాక కొండ నుంచి అనుమతులు లేకుండానే గ్రావెల్‌ను తరలించారు. లే అవుట్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు ట్రాన్స్‌కో అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
 
ఈయన హయాంలోనే శారదా నదిని ఇసుక మాఫియా కొల్లగొడుతోంది. ఇటీవల కాలంలో ఒక గ్రోయిన్(రాళ్లతో పేర్చిన ఆనకట్ట)ను ధ్వంసం చేసేందుకు ఈ మాఫియా విఫలయత్నం చేసింది. శారదా పరీవాహక  ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తవ్వించి తరలించడంలో మండల స్థాయి టీడీపీ నేతలు కీలకపాత్ర వహించారు.  వారిపై చర్యలు తీసుకోనివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారన్న వాదనలు ఉన్నాయి.
 
 అనకాపల్లి ఏరియా ఆస్పత్రిని ఇటీవల కాలంలో జిల్లాస్థాయి ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. స్వతహాగా డాక్టరైన ఎమ్మెల్యే తనయుడు పీలా శ్రీకాంత్ ప్రభుత్వ ఆస్పత్రిలో మకాం వేసి హల్‌చల్ చేసేవారు. గతంలో ఒక కాంట్రాక్టు ఉద్యోగిని తొలగించే విషయంలో తీవ్రస్థాయి దుమారం కూడా రేగింది.

అనకాపల్లిలోని క్వారీలను నియంత్రిస్తూ అనుచరుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్వారీ యూనియన్ల పేరిట జరుగుతున్న దందా నుంచి కార్పొరేట్‌స్థాయి క్వారీల నిర్వాహకులు తప్పించుకున్నా, చిన్నపాటి క్వారీల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రావెల్ క్వారీల విషయంలో అత్యుత్సాహం చూపించి ఏడాది క్రితం వారికి పర్మిట్లు ఇవ్వకుండా మైనింగ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

జి.ఉమాకాంత్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement