శివయ్య మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
వడమాలపేట: మండల కేంద్రమైన వడమాలపేట పంచాయతీలో మంగళవారం విద్యుత్ షాక్‌తో భవన నిర్మాణ కూలీ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు... పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి పంచాయతీ సదాశివవడ్డిపల్లికి చెందిన శివయ్య(24) వడమాల పంచాయతీ యాదవకాలనీలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పనికి వచ్చాడు. ఇంటి పైభాగంలో పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ లైన్ తగలడంతో అక్కడి నుంచి కింద ఉన్న ఇటుకలపై పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వడమాలపేట ఎస్‌ఐ నరేంద్ర, రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి యజమాని మణి, మేస్త్రీ శివను విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి రెండేళ్ల క్రితం వివాహమైంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ తెలిపారు.